బాతాఖానీ ఖబుర్లు –25

                                                            

     1975 లో నన్ను ఫాక్టరీ లో సేఫ్టీ సెక్షన్ కి మార్చారు. చెప్పానుగా మా ఫాక్టరీ లో ముఖ్యంగా కెమికల్స్ తయారు చేసేవారు.మేము మూడు షిఫ్ట్ లలో వెళ్ళవలిసి వచ్చేది.  పొద్దుట 6 నుండి 2.30 దాకా మొదటిషిఫ్ట్. మధ్యాన్నం 2.00 నుండి రాత్రి 10.30 దాకా రెండో షిఫ్ట్. రాత్రి 10.00 నుండి పొద్దుట 6.30 దాకా మూడో షిఫ్ట్. 6 గంటలకు ఫాక్టరీ చేరాలంటే  ఇంట్లో 5.15 కి బయలుదేరేవాడిని, నడిచి వెళ్ళేవాడిని ( సైకిల్ తొక్కడం రాక పోవడం వల్ల ) . సెకండ్ షిఫ్ట్ లో ఉన్నప్పుడు మాత్రం రాత్రి వచ్చేటప్పుడు మా ఫ్రెండ్ ఒకరు సైకిల్ మీద ఎక్కించుకొని తీసికెళ్ళేవాడు. ఇలా లాభం లేదనుకొని నాకు సైకిల్ నేర్పుతానన్నాడు. సరే చూద్దామని ఓ సైకిల్ అద్దెకు తీసికొని ఓ గ్రౌండ్ లోకి వెళ్ళి ఎలాగైతేనే అతను శ్రమ పడి నేర్పించాడు. గ్రౌండ్ లో తొక్కినంతసేపూ బాగానే తొక్కాను. రోడ్ మీద తొక్కుతూ వెళ్ళి సైకిలు కొట్టువాడికి ఇచ్చేయమన్నాడు. కొంత దూరం బాగానే వచ్చాను. ఎదురుగుండా ఓ కుక్క అడ్డు వచ్చేసరికి ఏంచేయాలో తెలియక ఆ రోడ్ మీద వస్తున్న ఒకావిడని గుద్దేశాను. చుట్టుపక్కల వాళ్ళందరూ నాతో దెబ్బలాడేసరికి భయం వేసి ఎలాగో సైకిలు నడిపించుకుంటూ వెళ్ళి ఆ సైకిలు కొట్టువాడికిచ్చేశాను. మళ్ళీ సైకిలు ఎక్కడానికి ప్రయత్నించలేదు !!

                                                            

      మా డ్యూటీ చాలా ఇంటరెస్టింగ్ గా ఉండేది. ప్రతీ గంట కీ అన్ని బిల్డింగ్ లకీ వెళ్ళడమూ, అక్కడ అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేయడమూ. ఏదైనా సరిగ్గా ఉండకపోతే అక్కడికక్కడే దాన్ని రెక్టిఫై చేయించడమూ. మరీ సరిగ్గా లేకపోతేనే వాళ్ళమీద రిపోర్ట్ చేయడం. ఆ మర్నాడు మా ఆఫీసర్ మా లాగ్ బుక్ చూసి మేం చేసిన పనిని రివ్యూ చేసేవారు.జనరల్ గా మా షిఫ్ట్ లో ఎవరిగురించీ రిపోర్ట్ లు ఉండేవికాదు, ఎందుకంటే ఏదైనా సరిగ్గా లేకపోతే ,మేము వాళ్ళకి చెప్పేవిధంగా చెప్పి సరి చేయించేవాళ్ళం. మా దగ్గరనుండి ఏవిధమైన రిపోర్ట్ లూ లేకపోవడం చూసి, మా ఆఫీసర్ ఒకసారి మాకు “మెమో ” ఇచ్చారు. ఈ సంగతి తెలిసి అన్ని సెక్షన్ ల వాళ్ళూ మాకు సపోర్ట్ గా జనరల్ మేనేజర్ కి మోర్చా తీసికెళ్ళారు. ఆయన చివరికి మా ఆఫీసర్ చేత మాకు అపాలజీ ఇప్పించారు.

                                                        

     నా అదృష్టమేమో కానీ నేను పనిచేసిన 42 సంవత్సరాలూ, నాకు మా జనరల్ మేనేజర్ ల తోటి డైరెక్ట్ గా సంబంధం ఉండేది.ఎక్కడ మీటింగ్ లయినా నా పేరు వచ్చేది. దానితో నా పాప్యులారిటీ కూడా బాగా పెరిగింది. ఇంకో సంగతేమంటే ఆ రోజుల్లో నేను ఒక పాకెట్ ట్రాన్సిస్టర్ ఎప్పుడూ  జేబులో ఉండేది. క్రికెట్ స్కోరులైనా, న్యుస్ అయినా అందరూ నాకే ఫోన్ చేసేవారు. చెప్పాలంటే రక్షణ శాఖ వారి దాంట్లో అలా రేడియోలూ అలాంటివి పెట్టుకోకూడదు. కానీ అందరికీ తెలుసును నా దగ్గిర ఉంటుందని, ఎవరికీ హాని చేయడం లేదు,  పాటలు అవీ వింటూ పని ఎగ్గొట్టడం లేదు.ఇది ఇలా ఉండగా ఓ రోజున

    మా ఫాక్టరీ జనరల్ మేనేజర్ దగ్గరనుంచి ఖబురు వచ్చింది. ఆయన ఓ మీటింగ్ లో ఉన్నారు. లోపలికి అందరి ఎదూరుగా పిలిచి  స్కోరెంత అన్నారు, ( అప్పుడు ఇండియా-వెస్టిండీస్ మాచ్ బొంబాయిలో జరుగుతూంది). నేను గొప్పగా పోజిచ్చి నాకేంతెలుసూ అన్నాను , ఆయన ” నీదగ్గర రేడియో ఉంటుందనీ, అందరూ నీదగ్గరే స్కోర్ తెలుసుకొంటారనీ మా అందరికీ తెలుసునూ, మాట్లాడకుండా, ఆ రేడియో తెచ్చి ఇక్కడ పెట్టు, మధ్యాన్నం వచ్చి తీసుకుపో ” అన్నారు. నోరుమూసుకొని ఆయన చెప్పినట్లుగా చేశాను. ఈ సంగతి ఫాక్టరీ అంతా నిమిషాల్లో తెలిసిపోయింది, ఇలా జనరల్ మేనేజర్ ఫణి బాబు ని రేడియో తో పట్టుకున్నారూ, పాపం ఏంచేస్తారో అని. నాకు అందరి సానుభూతి ఫోన్లూ వచ్చాయి!! మధాన్నం ఆయన చెప్పినట్లుగా రేడియో ఇచ్చేస్తూ, మా జనరల్ మేనేజర్ గారు, ” మరీ రేడియో వింటూ, పని అశ్రధ్ధ చేయకూ, నీవంటే అందరికీ మంచి అభిప్రాయం ఉందీ “.

                                                     

      చాలా మంది ( కిట్టని వాళ్ళు ) అనుకునేవారూ, ఫణిబాబు అందరికీ మస్కా కొడతాడూ, అందుకనే అందరూ అతడంటే ఇష్టపడతారూ అని. ఒక్కటి చెప్పండి మస్కాలు కొట్టి ఎంతకాలం నెగ్గుకు రాగలమూ. ఆయన వెళ్ళిపోయి ఇంకొకరు వచ్చేరంటే మన మాట ఎవరు వింటారూ?

జీవితం లో ఎప్పుడూ ఎవరికీ మస్కాలు మాత్రం కొట్టలేదు, నాలో ఉన్నది ఏమంటే నాకిచ్చిన పనిని క్షుణ్ణంగా నేర్చుకొని అందులో ఉండే సాధక బాధకాలు తెలిసికొనేవాడిని. ఎవరైనా నన్ను అడిగేలోపలే వాళ్ళు అడిగే ప్రశ్న ఆంటిసిపేట్ చేయడం, దానికి సమాధానం చెప్పడం. దీని వలనే నా సర్వీస్ లో ఎప్పుడూ,ఎటువంటి సమస్యలూ రాలెదు. గవర్నమెంటయినా, ప్రెవేట్ సర్వీస్ అయినా మన కిచ్చిన పని ( ఏదైనా సరే ) శ్రధ్ధ గా చేస్తే, ఎక్కడైనా నెగ్గుకు రాగలము. ఎప్పుడు సమస్య వచ్చినా సరే, మధ్య వర్తులద్వారా కాకుండా, మనమే డైరెక్ట్ గా అందరిలోకీ పెద్దాయన దగ్గరకు వెళ్తే అన్ని సమస్యలూ,తీరుతాయి. ఎప్పుడూ ” డెసిషన్ మేకింగ్ పవర్ ఉన్నవాళ్ళదగ్గరకే వెళ్ళాలి “, ఇదే సూత్రం నా జీవితమంతా పాటించాను, ఎప్పుడూ పరాజయం కలుగలేదు.

బాతాఖానీ క-తెరవెనుక (లక్ష్మి ఫణి ) ఖబుర్లు

                                                 ఈ ఆదివారం బాగా ఉంది. ఎందుకంటే  నాకిష్టమైన రెండు జరిగాయి !! మన ఎలెక్షన్లలో రెడ్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఇంకోటేమిటంటే ఫుట్ బాల్ లో నా ఫేవరెట్ రెడ్ ‘ మాంచెస్టర్ యునైటెడ్ ‘ ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ ‘ నెగ్గడం. ఇవాళ కూడా ఓ గోల్ కొట్టి స్టైల్ గా నెగ్గుంటే ఇంకా బాగుండేది.. పోన్లెండి ఏదో ఒకటి నెగ్గారుగా. ఇంక ” ఛాంపియన్స్ లీగ్” కూడా  నెగ్గేస్తే చాలా బాగుంటుంది. ఎఫ్.ఏ కప్ లో ఓడినప్పుడు చాలా బాధ అనిపించింది. నాకు నచ్చే ఇంకో రెడ్–ఫార్ములా వన్ లో “ఫెరారీ “. షూమాకర్ రిటైర్ అయినప్పడినుంచీ చూడ్డం తగ్గించేశాను. ఇవి అన్నీ మా అబ్బాయి ధర్మమా అని చూడ్డం మొదలుపెట్టాను. ఈ మాచ్ లు జరిగినప్పుడల్లా మేమిద్దరమూ ( వాడు పూనా లోనూ, నేను ఇక్కడా ) చాలా శ్రధ్ధగా చూడడం, వాటి గురించి మాట్లాడుకోవడమూ, రాత్రి ఎంతసేపైనా సరే, మాచ్ లు ఎప్పుడూ మిస్ అవలేదు.

                                                కమ్యూనిస్ట్ లు తుడిచిపెట్టుకు పోవడం చాలా బాగుంది. గవర్నమెంట్ లో చేరకుండా , బ్లాక్ మెయిల్ చేయడం వాళ్ళ స్పెషాలిటీ !!

ఏదో పాపం బెంగాల్ లో బుధ్ధదేవ్ కొంచెం చేద్దామంటే ఈ మిగిలిన కారత్ లాంటివాళ్ళు అడ్డం పెట్టి అంతా పాడుచేశారు.దానితో “నానో ” కాస్తా బెంగాల్ నుంచి వెళ్ళిపోయింది. ఈ ఎన్నికల ఫలితాలు నాకైతే చాలా చాలా నచ్చేశాయి. ఈ రాజకీయ వాదులు చేసే వెర్రి వెర్రి మాటలు ( కలర్ టి.వీ లూ, 100 రూపాయలకి సరుకులూ, నగదు బదిలీలూ ) నమ్మకుండా, స్థిరత్వానికి మన ప్రజలు ఓట్ చేశారని నా నమ్మకం. శ్రీ జయప్రకాష్ నారాయణ చేసిన ప్రకటన యదార్ధానికి దగ్గరగా ఉంది.

                                               ఎన్నికలు అయిపోయాయి, ఇంక ఎన్ని చానెల్స్ మిగులుతాయో చూడాలి.  ఇన్నాళ్ళూ ఎన్నికలు జరిగెదాకా చాలా బోరు కొట్టేశారు. ఇంక ఇప్పుడేం చేస్తారు?

%d bloggers like this: