బాతాఖానీ ఖబుర్లు –24

                                                      

    మా పాపని  ప్లేస్కూల్  కి  తీసికెళ్ళడం ఓ పెద్ద కార్యక్రమంలా ఉండేది. ఆ టీచర్ గారు వాళ్ళ ఇంటి కిటికీ లోంచి చూసేవారు. ఎత్తుకుంటే కోప్పడేవారు. అందువలన వాళ్ళ ఇంటి దాకా ఎత్తుకొని అక్కడనుంచి నడిపించేవాళ్ళం ! ఆవిడ దగ్గరున్న రెండు సంవత్సరాలూ చాలా బాగా ఉపయోగించాయి. హాండ్ రైటింగ్ చాలా చక్కగా వచ్చింది. పాపని పాషాణ్  లో ఉన్న శైంట్ జోసఫ్ గర్ల్స్ స్కూల్ లో వేయాలని మా ఉద్దేశ్యం. ఆవిడేమో దగ్గర్లోఉన్న కాన్వెంట్ లో వేయమంటారు. ఇంటర్వ్యూ కి తీసికెళ్తే  యూ.కే.జీ లో సీట్ ఇస్తామన్నారు. కానీ మాకు అక్కడ వేయడం ఇష్టం లేదు . పాషాణ్ స్కూల్లో అప్ప్లికేషన్లు ఇస్తున్నామని చెప్పారు. ఆరోజు తెల్లవారుఝామున 3.30 కి లేచి నడుచుకుంటూ వెళ్ళాను. అప్పడికే అక్కడ కార్లలో జనం వచ్చి 50 మంది దాకా క్యూ లో ఉన్నారు.

మొత్తానికి నా టర్న్ వచ్చేడప్పటికి  10.30 అయింది.  అంతా చేస్తే పాపకి జూన్ 15 కి మూడున్నర ఏళ్ళు రావు కాబట్టి సీట్ ఇవ్వమన్నారు చాలా నిరాశ చెందాము. ఇంకో స్కూల్లో వచ్చిన సీట్ వద్దన్నాము. ఇక్కడేమో ఇలా అయింది.

                                                   

      ఏమైతే అది ఔతుందని ఇంకో సంవత్సరం ఆవిడ దగ్గరకే పంపించాము. ఈసారి అప్ప్లికేషన్లు తీసుకోవడానికి ఇంకా పెందరాళే అంటే    2.30 కే బయల్దేరాను. ఆ టైము లో ఆటోలూ అవీ దొరకవు. నాకైతే సైకిలు కూడా రాదు, ఏం చేస్తాం ఆ చీకట్లోనే నడుచుకుంటూ వెళ్ళాను. అప్పడికి క్యూ లో 10 మంది మాత్రమే ఉన్నారు. ఇంకో సంగతి మరచిపోయాను. పాప బర్త్ సర్టిఫికేట్ తెలుగు లో ఉంది ( తణుకు పంచాయితీ వాళ్ళిచ్చింది ), దానిని ఇంగ్లీష్ లో అనువదించి, మా ఫాక్టరీ లో ఉన్న ఓ తెలుగు ఆఫీసర్ చేత అటెస్ట్ చేయించాను !! ఈ ఏడాది కి తనకి నాలుగున్నర ఏళ్ళు వచ్చాయి. ఇవ్వరేమోనని ఖంగారు పడ్డాను. ఆ టీచర్ నన్ను గుర్తు పట్టి ” క్రిందటేడాది కూడా వచ్చేవు కాదా ” అని, అప్ప్లికేషన్ ఇచ్చారండి. ఏమైతేనే అది పూర్తి చేసి ఇచ్చేశాను. ఇంటర్వ్యూ కి రమ్మన్నారు, ఓ పది రోజుల తరువాత. మేము తప్పించి అందరు పేరెంట్సూ కార్ల లోనే వచ్చారు. ఇదేదో చాలా హైఫై స్కూల్ రా బాబూ మనకి ఎక్కద దొరుకుతుందీ అనుకొన్నాము. కానీ మా అమ్మాయి చెప్పిన విధానంతో వాళ్ళు ఇంప్రెస్ అయ్యారు. ఇంక ఇంటికి వచ్చినప్పటి నుంచీ రిజల్ట్ వచ్చేదాకా టెన్షనే. అక్కడ సీట్ రావాలంటే చాలా ఇన్ఫ్లుయెన్స్ అదీ కావాలని మా ఫ్రెండ్స్ అందరూ ఖంగారు పెట్టేశారు, పైగా క్రిందటేడాది ఇక్కడ స్కూల్లో వేస్తే ఈ పాటికి ఫర్స్ట్ స్టాండర్డ్ కి వచ్చేదీ, ఇక్కడ వచ్చినా లోయర్ కే జీ లోనే ఇస్తారూ అని.

                                                 

    ఇలాంటి నిరాశావాదులు మనకి ప్రతీ చోటా ఎదురౌతారు. మనం ధైర్యంగా ఉంటే అన్నీ బాగానే జరుగుతాయి. దేముడి దయ వలన మా అమ్మాయికి ఆ స్కూల్లో సీట్ వచ్చేసిందండి. ఆ మర్నాడు వెళ్ళి ఫీజ్ కట్టేశాను. బస్ కి కూడా పేరు ఇచ్చేశాను.. అన్నీ బాగుంటే ఇంకేముందీ ! స్కూల్ తెరిచే సమయానికి మా పాపకి బస్సులో సీట్ లేదన్నారు. మాట్లాడకుండా రోజూ ఆటో లో పాపని తీసికెళ్ళి స్కూల్లో వదిలేవాడిని. తిరిగి వచ్చేడప్పుడు నడిచి ఇంటిదాకా రావడమూ, 11.30 కి బయల్దేరి నడిచి వెళ్ళి స్కూల్ దగ్గర వెయిట్ చేసి పాపని ఆటో లో ఇంటికి తీసుకు రావడమూనూ. ఇలా ఓ పది రోజులు చేశానండి. పూనా గురించి తెలిసిన వాళ్ళకి ఇదెంత దూరమో తెలుస్తుంది. రానూ పోనూ ఓ అయిదు కిలోమీటర్లుంటుంది. నా నడక ఓ పది కిలోమీటర్లుండేదన్నమాట..అన్నిసార్లూ ఆటో లో వెళ్ళే ఆర్ధిక స్తోమత ఉండేదికాదు. అయినా ఆ స్కూల్లోనేవేయాలనే కోరిక సాధించాము. మేము పడ్డ శ్రమ కి ఫలితం మా అమ్మాయి చూపించింది

                                             

      అక్కడ చదివిన అయిదు సంవత్సరాలూ తనే క్లాస్ ఫస్ట్. ఆన్యుఅల్ డే  రోజున ప్రైజు లు తిసికోవడానికి మా ఒక్క ఫామిలీయే ఆటో లో వచ్చేది. మిగిలిన వాళ్ళ కార్లు చూస్తూంటే కళ్ళు చెదిరి పోయేవి.. పాప పుట్టిన రోజు కి మేము ఎవరినీ పిలిచేవాళ్ళం కాము. అయినా  తన ఫ్రెండ్స్ అందరూ వారి వారి పేరెంట్స్ తో వచ్చేవారు..  మా అమ్మాయి వలన మా మీద గౌరవం పెరిగింది అందరికీ.

                                              

    ఇంకో సంగతి చెప్పనా—నన్ను ఎటువంటి పరిస్థితుల్లోనూ చదువు గురించి అడగకోడదన్నాను. వెర్రి తల్లి దాని బుల్లి చేతులతో ఓ కాగితం మీద పెన్సిల్ తో రాసిచ్చింది!!రోజూ తన షూస్ పాలిష్ చేయడమూ, డ్రెస్ ఐరన్ చేయడమూ నా డ్యూటీ. చదువంతా మా ఇంటావిడే చూసుకొంది. నా కెమైనా వస్తేకదా, తనకి నేర్పడానికి !! ప్రైజులు వచ్చినప్పుడు మాత్రం కాలర్ పైకి తీసికొనే వాడిని ! !

%d bloggers like this: