బాతాఖాని –తెరవెనుక(లక్ష్మిఫణి) ఖబుర్లు–మిస్టరీ షాప్పింగ్

                                                       నేను రిటైర్ అయిన మొదటి సంవత్సరంలో కొత్త ఫ్లాట్ ఫర్నిషింగ్, మా అబ్బాయి వివాహం హడావిడి తో తొందరగా గడిచిపోయింది. ఆ తరువాత ఏడాది మాత్రం చేయడానికి ఏమీలేక, పూణే నుండి పబ్లిష్ అయ్యే ఇంగ్లీష్ పేపర్లకి లెటర్స్ రాయడం మొదలుపెట్టాను. పంపినవన్నీ పేపర్లలో వెశారు. అది అయిన తరువాత జాతీయ ఇంగ్లీష్ మాగజీన్స్ కి రాయడం ప్రారంభించాను. వాళ్ళూ వేసికొన్నారు. అన్నీ కలిపి ఓ 200 దాకా పూర్తి అయ్యాయి. కాలక్షేపానికి పోనీ ఏదైనా జాబ్ చేద్దామా అనుకొన్నాను. ఐ.సి.ఐ.సి.ఐ వాళ్ళ ఇన్స్యూరెన్స్ ప్రయత్నిద్దామా అనుకొంటే మా అబ్బాయి ” ఈ బిజినెస్ లోకి వెళ్తే ఉన్న స్నేహితులు కూడా మొహం చాటేస్తారు, వద్దూ” అన్నాడు. చివరకి ఓ ముంబై బేస్డ్ కంపెనీ ని నెట్ లో పట్టుకొని దానికి రిజిస్టర్ చేసుకొన్నాను.

                                                     ఇంక వెనుకకు చూసుకోవలసిన అవసరం లేకపోయింది. వాళ్ళు మిస్టరీ షాపింగ్ ఏజన్సీ.  ముందుగా రిజిస్టర్ చేసికొన్నాను. ప్రతీ వారం నెట్ లో ఓ లిస్ట్ ఇస్తారు. మన ఊరికి సంబంధించినవి ఏమైనా ఉంటే దానికి అప్లై చేయాలి. సెలెక్ట్ చేస్తే మనకి ఓ మెయిల్ వస్తుంది, మనం చేయవలసిన ఆడిట్ వివరాలు చెప్తారు, ఓ డేట్ కూడా ఇస్తారు,మనకి ఇచ్చే ఫీజ్ కూడా చెప్తారు. మనం చేయవలసిన చెక్ లిస్ట్ కూడా ఉంటుంది.

                                                    దాని ప్రకారం మనకి అలాట్ చేసిన షాప్ కి వెళ్ళి, మనం ఏదో ఒక వస్తువు కొనాలి ( వాళ్ళు ఇచ్చిన బడ్జెట్ లో ). ఇది ఎందుకంటే మనం ఆ షాప్ కి వెళ్ళినట్లు గా ప్రూఫ్ అన్న మాట. ఆ షాప్ లో మన చెక్ లిస్ట్ ప్రకారం అన్నీ అబ్సర్వ్ చేయాలి. మనం ఎవరో ఆ షాప్ వాళ్ళకి తెలియకూడదు. ఈ వివరాలన్నీ ఆన్ లైన్లో ఉన్న ప్రశ్నల ప్రకారం మనం చూసిన వివరాలు రాయాలి, దానితో పాటు మనం కొన్న వస్తువుకి రసీదు స్కాన్ చేసి పంపాలి. వాళ్ళకు పంపిన 60 రోజులలో మనకి చెక్ వస్తుంది.

                                                 మొదట్లో వాళ్ళు చెక్ పంపుతారా లేదా అని అనుమానం ఉండేది. కానీ ఓ ఐదు ఆడిట్లకి చెక్ పంపడం తో వాళ్ళమీద నమ్మకం ఏర్పడింది. అలా పూణే లో ఉండగా ఓ నలభై వరకూ ఆడిట్లు చేశాను. వాళ్ళిచ్చే ఫీజ్ 500–1000 ఉంటుంది ఒక్కో ఆడిట్ కీ. నేను ఏదో సుఖ పడిపోతున్నానని, మా అవిడ కూడా చేస్తానంది . తనకి చాలా భాగం “పాండ్స్”  ఆడిట్ లు వచ్చేవి. అలా తనూ 30 వరకూ చేసింది. వాళ్ళ ధర్మమా అని పాండ్స్ వారి అన్ని ప్రోడక్ట్ లూ స్వంతం చేసేసికొంది.

                                                నేను చేసినవి— షాపర్స్ స్టాప్, ఎచ్.ఎస్.బి.సి బాంక్,క్రాస్వర్డ్,మక్డొనాల్డ్స్, ఫాబిండియా,  ట్రూ మార్ట్, ఎవో కొన్ని సినిమా మల్టిప్లెక్స్ లూ, ఇవే కాకుండా ఆప్టెక్ వాళ్ళు చేసే ఆన్ లైన్ పరీక్ష కి ఇన్విజిలేటర్ గా వెళ్ళడం , ఆ టెస్ట్ అవుతున్నంతసేపూ అక్కడుండడం వాళ్ళ మార్క్లు ఆన్లైన్ లో పంపడము. బలేగా ఉంది కదూ. కాలక్షేపానికి కాలక్షేపం, దానికి తోడు కొద్దిగా డబ్బులూ వచ్చేవి

                                              దీని ద్వారా  మాకు వివిధ రకాలైన మనుష్యులతో పరిచయాలు పెరిగాయి, వాళ్ళ మనస్తత్వాలూ తెలిశాయి. ఈ మిస్టరీ షాపింగ్ ఎందుకంటే కంపెనీ యాజమాన్యానికి వాళ్ళ ఎంప్లాయీల కస్టమర్ రిలెషన్ ఎలాఉందో తెలియడానికి.           

                                              ఇదే కాకుండా ఇంకోటి ఉందండోయ్ , వాళ్ళైతే  ఓ 1500 రూపాయలు గ్రాంట్ చేసి ఏదో రెస్టారెంట్ కి వెళ్ళి లంచ్/డిన్నర్ చేయ మంటారు.పైలాగే మన అభిప్రాయాలు చెప్పి, రిసీట్ పంపాలి. ఇద్దరు మాత్రమే వెళ్ళాలి, హొటల్ వాడిచ్చిన రసీదు లో ఇద్దరికంటే ఎక్కువ మంది ఉంటే డబ్బులు ఇవ్వడు.

                                            మేము ప్రతీ రెండు నెలలకీ పూణే వెళ్తూంటాము. ఆ వారం లో ఏమైనా అసైన్మెంట్స్ ఉంటే ముందుగానె అప్లై చేసుకుంటాను. కిందటి సారి వెళ్ళినప్పుడు “క్రోమా ” లో నేనూ, “మాక్డొనాల్డ్స్ ” లో మా ఇంటావిడా చేశాము. దానికి సంబంధించిన డబ్బులు వచ్చేశాయి. నిన్ననే వాళ్ళదగ్గరనుండి ఫోన్ వచ్చింది, ఏదో ఆప్టెక్ లో ఉంది చేస్తావా అని. ” సారీ బాస్ వచ్చేనెలనుండి చేస్తాను ” అని చెప్పాను.

                                            ఇక్కడ ఇవేమీ లేవు కాబట్టి మిమ్మల్ని బోరు కొట్టేస్తున్నాను !!

%d bloggers like this: