బాతాఖానీ ఖబుర్లు –23

                                                             మా నాన్నగారు మొత్తానికి ఓ ముహూర్తం పెట్టారండి, అన్నప్రాశన కి. తిరుపతి లో పుట్టువెంట్రుకలూ, అన్నప్రాశనా కలిపి చేద్దామని బయల్దేరాము. ఆ రోజుల్లో మా దగ్గర వి.ఐ.పి సూట్కేసులు ఉండేవికావు ( అవి కొనే స్తోమత కూడా లెదు ). మా ఇంటావిడ పుట్టింటినించి తెచ్చుకొన్న ట్రంక్ పెట్టి ( అలా ఎందుకు అంటారో ఇప్పడికీ తెలియదు !! ),ఓ బ్యాగ్గూ,  తీసికొని తిరుపతి చేరాము. ఆరోజుల్లో మా ఇంటావిడ ఫ్రెండ్ ఒకావిడ ( తణుకు అమ్మాయి), కొండ దారి దగ్గర ఉన్న “అలిపిరి ” క్వార్టర్స్ లో ఉండేవారు. వాళ్ళింట్లో ముందర దిగాము. అదేమిటో కానీ నాకు తిరుపతి చేరినప్పడినుంచీ విపరీతమైన జ్వరం, నీరసం వచ్చాయి.అయినా ముహూర్తం టైముకి వెళ్ళాలిగా, అదీ నడిచి మెట్ల మీదుగా. ఓ కుర్రాడిని సామాన్లు మోయడానికి పెట్టుకున్నాము. ఆ రోజుల్లో ఇప్పటి లాగ టీ.టీ.డి వాళ్ళు  సామాన్లు పైకి పంపే సదుపాయం చేయలేదు. పైగా ఉదయం 10 గంటలకి బయలుదేరాము. ఓ పక్క ఎండ, నేను నడవలేను. పాపం మా ఇంటావిడ పాపని ఎత్తుకొని ఆ సామాన్ల వాడి వెనక్కాల బయల్దేరింది ( మళ్ళీ వాడెక్కడ పారిపోతాడేమోనని!! ). నేను ఓ పది మెట్లెక్కడం, కూర్చోవడం, మా ఇద్దరికీ మధ్యన ఓ అయిదు వందల మెట్లైనా తేడా ఉండేది. పాపం ప్రతీ వాళ్ళనీ అడగడం దార్లో ఓ మఫ్లర్ కట్టుకున్నాయన కనిపించేరా అంటూ. ఎలాగైతే ఓ ఏడు గంటల తరువాత కొండ పైకి చేరానండి. అప్పటి కే మా ఇంటావిడ ఓ కాటేజీ కూడా తిసికొని రెడీ గా ఉంది. ఇదే మరి అవసరం ఒస్తే ఏ పనైనా చేయడానికి ధైర్యం వస్తుంది.

                                                           తప్పంతా మనలో ఉంది. అనవసరమైన జాగ్రత్తలు తీసికొని, గారం చేసి వాళ్ళని ఏ పనీ చేయనీయం. నేననేది ఈ రోజుల్లో ఆడవారి గురించి కాదండి బాబూ, .అప్పుడప్పుడు అనిపిస్తూంటుంది నేను కావల్సినదానికంటే ఎక్కువ అథారిటీ తీసికొన్నానేమో అని. బ్యాంక్ కి వెళ్ళాలన్నా, కూరలకి వెళ్ళాలన్నా బయట ఏ పనికోసం వెళ్ళాలన్నా నేను ఉండవలసి వస్తోంది. నాకు తెలుసు అవసరమైతే ” షీ విల్ రైజ్ టు ద అకేషన్ ” అని. ఆ అకెషనే ఇప్పడిదాకా రాలేదు !!

                                                         మాకు దర్శనం అయే సూచనలు ఏమీ కనబడలేదు. ఓ వైపు మా నాన్నగారు పెట్టిన టైము దగ్గరౌతోంది. ఇంతలో ఓ మార్వారీ కుటుంబం వారు, వాళ్ళదగ్గర ఏదో  ” సేవా ” టికెట్లున్నాయీ, ఇంకో ఇద్దరికి వాళ్ళతో వెళ్ళడానికి సౌలభ్యం ఉంది, వస్తారా అన్నారు. ఆ స్వామే వీళ్ళరూపం లో వచ్చారు అనుకొని, దర్శనం చేసికొని ఆ ప్రసాదం తోటే మా పాపకి అన్నప్రాశన చేశామండి. నేను చెప్పానుకదండీ నాకు ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి మీద అత్యంత భక్తి.

నెను 104 డిగ్రీల టెంపరేచర్ తో ఆయన దయ లెకుంటే ఆ ఏడు కొండలూ ఎక్కగలిగేవాడినా ? నన్ను ఆ రోజున చూసినవాళ్ళెవరూ నమ్మరు. అన్ని పనులూ చేసికొని కిందకు వచ్చేడప్పడికి నేను ఏక్ దం పెర్ఫెక్ట్ అయిపోయాను.

                                                      అక్కడినుంచి అమ్మవారి దర్శనం చేసికొని మెడ్రాస్ వెళ్ళాము. అప్పడికి మా బాబయ్య గారు స్వర్గస్తులైయ్యారు. ఆయన ఉండి ఉంటే నన్నూ నా బుల్లి ఫామిలీ ని చూసి చాలా ఆనందించేవారు. ఎందుకంటే ఆయన  ఎప్పుడూ అనేవారు ” నీకున్న ప్రోబ్లెం గురించి వర్రీ అవకూ, పుట్టే పిల్లలు లక్షణం గా ఉంటారు ” అని. పోన్లెండి పైనుంచి మాకు ఆయన ఆశీర్వాదం ఉంది. అక్కడ ఉండగానే మా ఇంటావిడ కి వాళ్ళ అమ్మమ్మ గారు కలలోకి వచ్చారు. ఈవిడకేమో అంతా ఖంగారు.అక్కడున్నన్ని రోజులూ నిరుత్సాహంగానే ఉంది. దానికి సాయం మా పిన్నిగారు ఓ స్టూల్ వేసికొని, మా బాబయ్య గారి ఫొటో కి దండ వేయ మన్నారు. అది వేసి దిగుతూంటే ఢాం అని కింద పడ్డాను, అన్నీ బాగున్నాయనుకొంటే ఇదో గొడవ వచ్చింది. అయినా పూనా బయల్దేరి వచ్చేశాము.

                                                     ఇంటికి వచ్చేసరికి వాళ్ళ అమ్మమ్మ గారు స్వర్గస్థులైనారని ఉత్తరం ఉంది. అందుకేనేమో పాపం  మెడ్రాస్ లో ఉన్నప్పుడు మా ఇంటావిడ అంత బాధ పడిపోయింది. ఆవిడ తో మా ఇంటావిడ కి చాలా అనుబంధం ఉంది. జీవితంలో కావల్సినవి అన్నీ ఆవిడ దగ్గరే నేర్చుకొంది.మా అమ్మమ్మ గారు కూడా 1973 జనవరి లో స్వర్గస్తులైనారు. మా పాపని ఆవిడకు చూపే అదృష్టం మాకు లేకపోయింది. ఆవిద చలవ వల్లే మా వివాహం జరిగింది.

                                                   1975  సంక్రాంతి కి భోగిపళ్ళ టైముకి మా నాన్నగారు పూనా వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ ఏడాదే మేము ఈ కలాస్ నుండి మారి ఫాక్టరీ క్వార్టర్స్ కి మారాము. అవి కర్కీ స్టేషన్ కి దగ్గరలో ఉండేవి. ఆ ఏడాది అంటే 1975 అక్టోబర్ లో మా నాన్నగారు స్వర్గస్తులైనారు.

                                                   1976 నుండీ మా పాప ని బొంబే పూనా రొడ్ లో ఉన్న మిస్సెస్. లారెన్స్ అన్నావిడ దగ్గరకు  పంపేవాళ్ళం.తనని చూసిన మొదటి క్షణం లో నే ఆవిడ ” ఈ పాప చాలా బ్రిల్లియంట్ బాగా పైకి వస్తుందీ ” అన్నారు. నేను షిఫ్ట్ ల లో పనిచెసేవాడిని. మొత్తం దాని చదువు అంతా నా భార్యే చూసుకొనేది.

నా పని అల్లా ఇంట్లో ఉన్నప్పుడు తనని తీసికొని ఆ చుట్టుపక్కల తిప్పడమే. ఆ టైము లోనే తనకి జనరల్  నాలెడ్జి చెప్పేవాడిని. నా కొచ్చిందల్లా అదే కాబట్టి !!

%d bloggers like this: