బాతాఖాని –తెరవెనుక ( లక్ష్మిఫణి ) ఖబుర్లు


                                        

    నా చిన్నప్పుడి ఖబుర్లు రాసేటప్పుడు కొన్ని కొన్ని మర్చిపోయాను.మండపేట లో 4 ఫారం చదివేవాడిని. ఆ రోజుల్లో కొంచెం ఇంగ్లీష్ బాగానే వచ్చుననిపించేది. ఓ సారి క్లాసు లో మా ఇంగ్లీష్ మాస్టారు  శ్రీ పార్వతీశ్వర  శాస్త్రిగారు   పాఠం చెపుతూ, ” డిపార్ట్ ” అనే వర్డ్ కి నౌన్ ఫారమ్ చెప్పమన్నారు. చాలా మందికి తెలియలెదు. నా ముందర కూర్చున్నవాడు కొంచెం తెలివైనవాడు అన్ని సబ్జెక్ట్ లలోనూ, వాడిని ఏడిపిద్దామనిపించింది. ఏదో నాలో నేను గొణుక్కుంటున్నట్లుగా  ” డిపార్ట్మెంట్” అన్నాను. అది వాడు వినేసి మాస్టారు అడగ్గానే చెప్పేశాడు.” ఛ, నోర్ముయ్ ” అని వాడిని కోప్పడ్డారు. నా టర్న్ వచ్చింది గొప్పగా లేచి  ” డిపార్చర్ ” అన్నాను. ఇంకేముంది అందరిచేతా చప్పట్లు కొట్టించారు. చేసిన పాపం చెపితే పోతుంది–నా కెంత పైశాచికానందం వచ్చిందో !!

                                    

    చెప్పానుగా చిన్నప్పుడు మనకెన్నో వెర్రి వెర్రి నమ్మకాలుంటాయి. అమలాపురం నుంచి ముక్తేశ్వరం వెళ్ళే దారిలో ఓ బ్రిడ్జ్ కి ఇవతలగా

రోడ్ మీదకున్న పొలంలో ఏవో రెండు ‘తులసి కోటల్లా” ఉండేవి. వాటిని చూడగానే ప్రతీ సారీ దండం పెట్టేవాడిని. అలా చాలా కాలం జరిగింది. ఒకసారి మా అమ్మగారో ఎవరో చూశారు. అదేమిట్రా బడుధ్ధాయీ  వాటికి దండం పెడతావూ, అవి ఎవరో పోతే వాళ్ళ జ్ఞాపకార్ధం కట్టించారూ అని కోప్పడ్డారు. ఏమిటో వాళ్ళకి ఋణ పడి ఉండి ఉంటాను, అన్ని రోజులూ దండం పెట్టాను!!

                                   

    అమలాపురం నుంచి ముక్కామల దాకా ఏటిగట్టు మీదనుంచి సైకిలు మీద వెనక్కాల కూర్చొని వెళ్ళడం ఒక మధుర జ్ఞాపకం. అలాగె మండపేట నుంచి రాజమండ్రీ దాకా ద్వారపూడి మీదుగా వెళ్ళడం. అప్పుడు ఎవరైనా మెడ్రాస్ నుంచి కానీ, విశాఖ నుంచి కానీ రైల్లో వస్తే ద్వారపూడి లోనే వాళ్ళని రిసీవ్ చేసుకోవలసి వచ్చేది. మా చిన్నప్పుదు  కోనసీమ లో  ” పుల్లేటికుర్రు మర్డర్ ” కేస్ అని ఒకటి జరిగింది. ఒకే

 కుటుంబం లో వాళ్ళందరినీ చంపేశారుట. అదేమిటో బస్సు పుల్లేటికుర్రు వచ్చేడప్పడికి చాలా భయం వేసేది.ఆరోజుల్లోనే మడ్రాస్ లో “అళవందార్” హత్యకేసొకటి జరిగింది.ప్రతీరోజూ పేపర్లో దానిగురించి చదవడం మర్చిపోలేను.

                                  

    ఎప్పుడైనా రాజమండ్రి వెళ్ళాలంటే  బొబ్బర్లంక దాకా బస్సు లో వచ్చి అక్కడ లాంచీ మీద గోదావరి దాటడం, అలాగే కాకినాడ వెళ్ళాలంటే ముక్తేశ్వరం దాకా వచ్చి రేవు దాటడం. ఎప్పుడు గోదావరి దాటాలన్నా భయమే ! ఆ పడవ అటూ, ఇటూ ఊగుతోంటే కళ్ళు మూసేసుకొని ఓ పక్కగా కూర్చోవడమే.

ఒక్క తణుకు వెళ్ళేటప్పుడు మాత్రం గన్నవరం దాకా బస్సు లో వచ్చి లంకలో నడిచి కోడేరు దగ్గర గోదావరి పాయ లోంచి నడచి రేవు దాటడం. ఇదొక్కటే బాగుండేది పడవ ఎక్కఖర్లేదుగా!! ఎప్పుడినా వరదలు వస్తే మా క్లాసు పిల్లల్ని ముక్తేశ్వరం చూడడానికి తీసికెళ్ళేవారు. అంతవరకూ బాగానే ఉంది, దానిమీద ‘కాంపోజిషన్ ” రాయమనేవారు. ఇది బాగుండేది కాదు.

                                 

    ఆ రోజుల్లో తెలుగు లో ఛందస్సు ఒకటి ఉండేది. ఉత్పలమాలా, చంపకమాలా, మత్తేభం, శార్దూలం వగైరా.. వాటీ చందస్సు బట్టీ పట్టడం ఒక మధురమైన జ్ఞాపకం.  జనరల్ మాథమెటిక్స్ లో అవేవో లెఖలుండేవి. నలుగురు మనుష్యులు ఒక గోడని నాలుగు రోజుల్లో కడితే అదే గోడని నలుగురు పురుషులూ, ఇద్దరు స్త్రీలూ ఎన్ని రోజుల్లో కడతారూ అని.. ఈ వ్యవహారాలన్నీ ఎందుకో అర్ధం అయ్యేది కాదు., ఈ సందర్భం లో ఆ మధ్యన పురాణం సీత గారు ‘ఇల్లాలు ముచ్చట్లు”లో ఈ లెఖలు ప్రస్తావించి.. నలుగురు పురుషులూ, ఇద్దరు స్త్రీలూ కలిస్తే గోడలు ఎందుకు కడతారూ అని చదివినప్పుడు చఛ్ఛే నవ్వు వచ్చింది. ఇలాంటి ఆలోచనలు మన చిన్నప్పుడు వచ్చేవి కాదుగా.

                              

    పుస్తకాల షాపు వాడిని అడిగి ఓ టైంటేబిల్ కాగితం తీసికోవడం, దానిమీద  క్లాసులూ, పిరియడ్లు, వారం లో సిటిజెన్షిప్ అనీ, డ్రిల్లు అనీ పీరియడ్లు కూడా ఉండేవి, అవేకాకుండా మోరల్ అని ఒకటి ఉండేది.  ఆరోజుల్లో చదువొక్కదానిమీదే కాకుండా డ్రాయింగ్, క్రాఫ్ట్ క్లాసులు కూడా ఉండేవండోయ్. అవి అన్నీ గుర్తు చేసికొంటే ఎంత బాగుంటుందో. ఎప్పుడైనా గోదావరి స్నానం చేయాలంటే గట్టు మీద కూర్చొని ఓ చెంబు తో పోసుకోవడమే !! ఇప్పడికీ నీళ్ళ భయం పోలేదు.

                             మేము ఏడాది నుంచీ గోదావరి గట్టుమీద  ఉంటున్నాము కదా అని మా ఫ్రెండ్స్ మమ్మల్ని” అబ్బ ఎంత అదృష్టమండీ రోజూ గోదావరి స్నానం చేయొచ్చు ” అంటే నేనో వెర్రి నవ్వు ఒకటి నవ్వేస్తాను !!

7 Responses

  1. మీ డిపార్టుమెంట్ జోకు సూపరు. మా ఇంటిపెద్దవాళ్ళల్లో ఒకాయన ఇటువంటిదే ఒక జోకు చెబుతుండేవాళ్ళు. వాళ్ళందరూ పేపర్లో ఇంగ్లీషు నట్లు పోకుండా ధారాళంగా చదూతారో అని పందెం వేసుకున్నారుట. ఒకాయన చదువుతున్న వరుసలో .. తరువాతి మాట psychology వస్తే, పక్కనే ఉన్నతను పిస్కాలజీ అని అందిస్తే అలాగే పైకి చదివేశాట్ట. అప్పణ్ణించీ ఆయన పిస్కాలజీ మేష్టారైపోయాడు.

    Like

  2. అయ్యో, ఐతే “డిపార్ట్ ” అనే వర్డ్ కి నౌన్ ఫారమ్ డిపార్టుమెంట్ కాదా మాస్టారూ, ఏమీటో, నేను పరధ్యాన్నం గా చదువుకున్నానో, మా మాస్టారే పరధ్యాన్నం గా చెప్పారో గుర్తు లేదు.
    ” ఆ రోజుల్లో తెలుగు లో ఛందస్సు ఒకటి ఉండేది.”

    అది ఇప్పటికీ ఉంది, మీరు చదువుకున్నప్పటి పుస్తకాలలో నిక్షిప్తమై. మీరనటం పాఠ్యాంశంగా అని కదా, ఇప్పుడు సంధులు సమాసాలు కూడ లేవేమో – కొన్నాళ్లకి ఫ్రెంచి, సంస్కృతం మల్లే, తెలుగుని ఇంగ్లీష్ లో వ్రాసి వందకి వంద తెచ్చుకొనే పరిస్థితి రావచ్చు, ఆంధ్రదేశంలో.
    “బీరు” బోకుండా చదువుతున్నా, మీరు కొనసాగించండి.
    భవదీయుడు

    Like

  3. మీ పోస్టులో మండపేట అని చదివి ఇలా వచ్చాను.మా చుట్టుపక్కల ఊళ్ళన్నీ తిప్పించేసారు.థాంక్సు.

    Like

  4. ఎవరి పుస్తకాలు వాళ్ళే తెచ్చుకోండి – whose whose books those those taken — లా చదువుకునేవాళ్ళం

    Like

  5. కొత్తపాళీ, ఊకదంపుడూ, రాధిక, పానీపూరీ గార్లకు

    మీకు నచ్చుతున్నందుకు చాలా చాలా థాంక్స్ అండి.

    Like

  6. Thanks for memories in Mandapeta
    for so long years back
    My native place Mandapet
    Thanks for rememberance.

    Like

  7. లింగరాజు గారూ,

    మా నాన్నగారు మండపేటలో హెడ్ మాస్టారుగా పనిచేసినప్పుడు,1956 లో ఫోర్త్ ఫారం చదివాను అక్కడ.తరవాణీ పేటలో శ్రీ చీమలకొండ పార్వతీశ్వర శాస్త్రి గారింట్లో అద్దెకుండేవాళ్ళం.

    Like

Leave a comment