బాతాఖానీ ఖబుర్లు –22

                                                                 మా ఇంటావిడ ఊరు వెళ్ళినప్పుడు మాత్రం రోజుకి ఒక ఉత్తరం చొప్పున రాసేవాడిని. అక్కడనుంచి కూడా ఓ ఉత్తరం రావల్సిందే. (మనలో మన మాట  ఆ ఉత్తరాలన్నీ ఇప్పడికీ ఉంచాము , మా పిల్లలికి తెలుగు చదవడం రాదు కాబట్టి బతికిపోయాము !! ). తెలిసీ తెలియని రోజుల్లో ఎన్నెన్నో ప్రామిస్ లు చేసేస్తాము, అవి అన్నీ తీర్చాలంటే చాలా కష్టం అండి బాబూ. వచ్చిన గొడవ ఏమిటంటే అన్నీ రైటింగ్ లో కమిట్ అయిపోయాను !!

                                                                     పేళ్ళికి రెసెప్షన్ లాంటివి ఇవ్వక పోవడం తో మా మొదటీ యానివర్సరీ కి మా ఇంట్లో పార్టీ చేశాము. మా ఫ్రెండ్స్ అందరినీ పిలిచాము. విశేషం ఏమిటంటే అప్పుడు వచ్చిన గిఫ్ట్ లు చాలా మట్టుకు ఇప్పడికీ ఉన్నాయి. 1973  డిశంబర్ మూడవ వారం లో మా ఇంటావిడ పురిటికి వెళ్ళింది. అప్పడిదాకా మా డాక్టరమ్మ గారు చెకింగ్ చేసేవారు. ఆవిడ పై చదువులకి ఇంగ్లాండ్ వెళ్తూ ఇంకో డాక్టర్ కి అప్పగించారు. ఆవిడేమో  పురుడు రావడానికి

 మార్చ్  7 వ తేదీ ఇచ్చారు.  మాకు ఏదో నమ్మకం–ఆ రోజుకి తప్పకుండా పురుడు వచ్చేస్తుందని. పుట్టే పాపకి పేరు కూడా సెలెక్ట్ చేసేసుకొన్నాము. ” రేణు ” అని.

అనుకొన్నట్లుగానే మార్చ్ 7 వ తెదీ మా  మామగారి దగ్గరనుంచి టెలిగ్రాం వచ్చేసింది. అప్పుడు మా చిన్నన్నయ్య గారు పూనా లోనే ఉన్నారు–ఏదో పని మీద వచ్చారు. పాపకి కావల్సినవన్నీ కొనుక్కొని మార్చ్ 17  కి తణుకు చేరాను. ఇంట్లోకి వెళ్ళేముందరే మా అత్తగారి తల్లి గారు రోడ్ మీదే నన్ను పట్టుకొని ” అప్పుడే పిల్లని చూసేయకు, శాంతి నక్షత్రం ” అన్నారు. 24 గంటల పాటు నా బంగారు తల్లిని చూడనీయలేదు. చెప్పేనుగా నా అనుమానాలు నాకు ఉన్నాయి పాప ఎలా ఉందో అని.నా భార్య స్వయంగా చెప్పిన తరువాత చాలా చాలా సంతోషపడిపోయాను. ఆ మర్నాడు బారసాల చేసికొన్నాము. అనుకొన్నట్లుగానే రేణు అని పెట్టుకొన్నాము.

                                                                 ఓ పాప కూడా మా జీవితాల్లోకి వచ్చి మా వివాహానికి ఓ సంపూర్ణత తీసికొచ్చింది.వీళ్ళనిద్దరినీ రెండో నెల నిండగానే పూనా తీసికొచ్చేయడానికి మళ్ళీ అమలాపురం, తణుకూ వెళ్ళాను. ఆ రోజుల్లో పూనా రావాలంటే డైరెక్ట్ ట్రైన్ ఉండేదికాదు. హైదరాబాద్ వచ్చి ఇంకో ట్రైన్ ఎక్కవలసి వచ్చేది. తణుకు స్టేషన్ లో నా భార్య అమ్మమ్మ గారు పాపని ఎండ తగలకుండా పాపం కొంగు చాటున ఉంచి, మాకు అన్నీ ఇచ్చి పాపని ఇవ్వడం మర్చిపోయారు !!

ఏమయితేనే మేం ముగ్గురం పూనా చేరిపోయాము. అంతా కొత్తే. ఏమీ తెలియదు. మా అదృష్టం కొద్దీ మా బిల్డింగ్ లో ఉండే ఆవిడే  మిస్సెస్. పఠాన్  అనే ఆవిడే మాకు పెద్ద దిక్కుగా ఉండేది. ఆవిడని ” వదినగారూ ” అని పిల్చేవాడిని.  మా ఇంటావిడకి అంతా చేస్తే 21 సంవత్సరాల వయస్సు. పిల్లని ఎలా పెంచిందో ఆ భగవంతుడికే తెలియాలి.. మా అమ్మాయి నా దగ్గరకు వచ్చేది కాదు!! పైగా నన్ను చూడగానే భయ పడి భోరు మని ఏడుపూ అదీను.

                                                                 ఇది ఇలాగ ఉండగా మా ఆవిడ కి    ఏదో వేయిస్తూంటే  నూనె చేతులమీద పడింది. ఇంకేముందీ, వార్త తెలియగానే మా అత్తగారు పూనా వచ్చారు సహాయం చేయడానికి. ఏమైతేనే ఈ విడకి చేయి కాలడం ధర్మమా అని మా పాప నాకు దగ్గిర అయింది. ఇంక అప్పడినుంచీ నన్ను పట్టేవాళ్ళు లేరు.  ఆరోజుల్లో ఒకసారి పాపకి      “డైయేరియా ” వచ్చింది. డెక్కన్ లో ఉన్న డాక్టర్ దల్వీ అన్నాయన దగ్గరకు తీసికెళ్ళాము. ఆ రోజు నుండీ ఈ రోజు వరకూ, మా పిల్లలిద్దరికీ, మనవరాళ్ళు, మనవడికీ ఆయనే డాక్టరు. ఆయన దగ్గర అప్పటి పిల్లల రికార్డ్ ఇప్పటికీ ఉంచారు!!

                                                                 ఏమిటో వెర్రి నమ్మకాలూ, అన్నప్రాశన అయెదాకా ఏమీ పెట్టకూడదని. పాపం వెర్రి తల్లిని మాడ్చేశాము. ఎవరితోనైనా అని ఉంటే చెప్పేవారేమో !! పాలు తప్ప ఏమీ ఇచ్చేవారము కాము!!

%d bloggers like this: