బాతాఖాని— తెరవెనుక ( లక్ష్మిఫణి ) ఖబుర్లు

                                                  

    మేము పూణే  ఫాక్టరీ క్వార్టర్స్ లో ఉన్నప్పుడు  కర్కీ రైల్వే స్టేషన్ కి దగ్గర లో  ఉండేవాళ్ళం. నేను ప్రతీ రోజూ ఫాక్టరీ కి మా ఫ్రెండ్ తో స్కూటర్ మీద వెళ్ళేవాడిని. పొద్దుటే మా ఇంటావిడ ” డబ్బా ” తయారు చేసి ఇచ్చేది. నేను రోజు విడిచి రోజు కర్కీ రైల్వేస్టేషన్ లో ఉన్న బుక్ స్టాల్ లో తెలుగు పత్రికలూ అవీ తీసికొనేవాడిని. అప్పుడు ఇందిరాగాంధీ గారు ” ఎమర్జెన్సీ ” విధించిన రోజులు అంటే 1975 అన్న మాట.

                                                 

      అలవాటు ప్రకారం నేను మా ఫ్రెండ్ వచ్చేలోపల, పుస్తకాలు తెచ్చేసుకోవచ్చు కదా అని స్టేషన్ లోకి వెళ్ళాను. అప్పుడే మద్రాస్- బొంబాయి  ఎక్స్ప్రెస్ స్టేషన్ లోకి వచ్చి వెళ్ళడానికి సిధ్ధం గా ఉంది. నేను చూసుకోలేదు, పుస్తకాల గొడవ లో పడి. ఇంతట్లో ఎవరో నా భుజం మీద చేయి వేసి , నన్ను ఆగమన్నాడు. ” టికెట్ హై క్యా ” అని అడిగాడు. లేదన్నాను .నన్ను బరబరా లాక్కెళ్ళి ఓ రూమ్ లోకి తీసికెళ్ళాడు. అప్పటికే అక్కడ  ఏడుగురు  మనుష్యులు చేతికి

సంకెళ్ళతో ఉన్నారు. మీరు ఎప్పుడైనా సంకెళ్ళు చూశారా ? ఇద్దరేసి మనుష్యులకి  ఒక సంకెల ( హాండ్కఫ్) వేస్తారు. అంటే ఏడుగురికి అప్పడికే వేశారు, ఒక్కటి మాత్రం ఖాళీగా ఉంది. అదికాస్తా నాకు వెసేస్తే ఆరోజుకి వాళ్ళ “కోటా ” పూర్తి అయినట్లన్నమాట.  ఇలా బేడీలు వేసిన వాళ్ళందరినీ ఓ తాడు తో కట్టేసి శివాజీ నగర్ కోర్ట్ కి తీసికెళ్తారన్న మాట.. వీడెవడో తెలియదు నా మాట వినడానికి రెడీ గా లెడు. నా గోల నాదే, మడ్రాస్ నుంచి రాలేదురా బాబూ అంటే వినడే. టికెట్ చూపించు లేకపోతే వీళ్ళతో నడూ అంటాడు. మా ఇల్లు స్టేషన్ కి బయటే ఉంది, నేను  డ్యూటీ కి వెళ్తున్నానూ, కావలిస్తే నా ఐ కార్డ్ చూడమన్నాను. నా కవన్నీ అనవసరం, టికెట్ చూపించు లేదా ….

                                                ఇంతలో నా అదృష్టం కొద్దీ ఇంకొకాయన ఆ రూమ్ లోకి వచ్చారు. ఏమిటీ గొడవా అంటూ. మళ్ళీ నా గోల ప్రారంభించాను. ఆయనా అదే అడిగారు. నేను ఇప్పుడే ఇంటి నుంచి బయల్దేరానూ, కావలిస్తే నా డబ్బా చూడండి, ఇంకా వేడిగా ఉంది, నేను పుస్తకాల కోసం బుక్ స్టాల్ కి వెళ్ళానూ, అన్నాను.

మామూలుగా ఏమిటంటే రికామీ గా తిండి లేకుండా తిరిగే వాళ్ళు ( ఎలాగూ వాళ్ళ దగ్గర టికెట్ ఉండదు ), ఈ ” ఫ్లయింగ్  స్క్వాడ్” వాళ్ళకిపట్టు పడతారు, ఎందుకంటే

ఓ రెండు మూడు రోజులైనా వీళ్ళకి తిండి దొరుకుతుందని!! ఈయనెవరో రాకపోతే నేను కూడా  ఆ ఏడుగురితో పాటూ జైలు తిండి తినేవాడిని.

                                             

    ఈ వచ్చినాయన ఎలాగైతే నేను చెప్పినవన్నీ నమ్మారు. “నీ రోజు బాగుండి నేను వచ్చానూ, ఈ ఫ్లైయింగ్ స్క్వాడ్ వాళ్ళ దగ్గిర సంకెళ్ళ కి తాళాలు కూడా ఉండవు, కోర్ట్ కెళ్ళేదాకా నిన్ను భగవంతుడు కూడా కాపాడకలిగేవాడు కాదు” అని ఓ వార్నింగ్ ఇచ్చారు. ఆయన చెప్పిందేమిటంటె, ఎప్పుడైనా ప్లాట్ఫారం మీదకు వచ్చేడప్పుడు ( అంటే ఇలాంటి పనులకి ) ఎంట్రెన్స్ దగ్గర ఉన్న టీ. సీ .తో చెప్పి వెళ్ళు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఒక్కడైనా ఉండాలి, నీ నిజాయితీ సర్టిఫై చేయడానికి  అన్నారు.

                                            ఈ 34 సంవత్సరాలలోనూ మళ్ళీ ఎప్పుడూ టికెట్ లేకుండా ప్లాట్ఫారం మీదకు వెళ్ళలేదు.

%d bloggers like this: