బాతాఖానీ ఖబుర్లు —21

                                                          

   వచ్చిన మొదటి సవత్సరం లో మా ఇంటావిడ ని డాక్టర్ గారి వద్దకు తీసికెళ్ళవలసి వచ్చింది. మా ఫ్రెండ్ మూర్తి తనకు తెలిసిన ఓ తెలుగు డాక్టర్ గారున్నారు, ఆవిడ దగ్గరకు వెళ్ళండి అన్నాడు. ఆవిడ కి మేము తెలుగు వాళ్ళమే అని ఎలా తెలియచేయాలీ  అని ఆలోచించి చేతిలో ఒక తెలుగు పుస్తకం పట్టుకొని వెళ్ళాము. ఓ సంగతి చెప్పనా ఆరోజు పరిచయం అయిన డాక్టర్. శ్రిమతి కె. ఏ .రావు గారి దగ్గరే మాకు ఇప్పటికీ వైద్యం. మా అబ్బాయి,  మనవడు ( అమ్మాయి కొడుకు), మనవరాలు  ( అబ్బాయి కూతురు ) అందరూ ఆవిడ చేతిలో పుట్టిన వాళ్ళే !! ఇప్పటికీ ఆవిడ దగ్గరకు వెళ్ళినప్పుడు ” ఈ అమ్మాయి ( అంటే  నా భార్య) కొత్త పెళ్ళికూతురు గా  37 సంవత్సరాల క్రితం నా దగ్గరకు వచ్చిందీ అని ఆ రోజులు జ్ఞాపకం చేసికొంటారు. నేను అప్పుడప్పుడు ఆవిడతో అంటూంటాను ‘ మా మనవరాలికి కూడా పురుడు పోస్తే మిమ్మల్ని ” గినెస్ రికార్డ్ “లలోకి పెట్టేయవచ్చు అని.

                                                       

    ఓ వారం రోజులు చూసిందండి, మాఇంటావిడ  మా ఇంట్లోనుండి తీసికెళ్ళిన  వాళ్ళు సరుకులు తిరిగి ఇస్తారేమో అని. అబ్బే వాళ్ళెందుకు ఇస్తారూ. ఈవిడ ఇంటింటికీ తిరిగి మొత్తానికి చాలా భాగం వస్తువులు తిరిగి తీసికొంది, అప్పడికీ కొన్ని సరుకులు గాయబ్ అయిపోయాయి. ఏం చేస్తాం .

అప్పటినుంచీ   ఆ జనాలందరికీ నేనంటే ‘ బెల్లం ముక్క” మా ఆవిడంటే  ” అల్లం ముక్కా ” అయిపోయాము. అందరూ ” పచ్చి” కొట్టేశారు.పోన్లే సగం గొడవ వదిలిందీ అనుకొన్నాము. మనవాళ్ళ కంటే , మా బిల్డింగ్ లో ఉన్న ఇతర భాషల వాళ్ళ తో స్నేహం బాగా బల పడింది..

                                                      

    మేమైతే ప్రతీ వారం, సినిమాకి పోవడం, బయట భోజనం చేసి కొంపకి చేరడం. ఈ మధ్యలో మా నాన్నగారు తిరుపతి లో కల్యాణం చేయిస్తున్నామూ అక్కడికి రండన్నారు. సరేనని ఇద్దరం బయల్దేరి తిరుపతి వెళ్ళాము.అక్కడనుంచి మెడ్రాస్ వెళ్ళాము.. మెడ్రాస్ లో  ఈవిడని తిప్పడానికి బయటకు తీసికెళ్ళాను. మౌంట్ రోడ్ అంతా నడిపించాను. ఇంటికి వచ్చి చెప్తే మా పిన్ని గారు చీవాట్లు వేశారు. 

                                                      

    ఒకసారి మా మామగారు వచ్చి మా ఇంటావిడని పుట్టింటికి తీసికెళ్ళారు.. ఇన్నాళ్ళూ అలవాటైపోయింది. పాపం పొద్దుటే నన్ను లేపి ఫాక్టరీ కి  పంపడం అదీను. ఈవిడ వెళ్ళినరోజు రాత్రి పడుక్కునేముందర ఓ ఐడియా వచ్చింది. నీళ్ళ  కుళాయి తెరిచి దానికింద బకెట్ పెట్టాను. తెల్లవారుఝామున నీళ్ళ చప్పుడికి లేవచ్చుకదా అని.  పొద్దున్నే ఎవరో తలుపు మీద కొట్టడం ప్రారంభించారు. ఎవరా అని చూస్తే, మా ఇంటి కింద పోర్షన్ వాళ్ళు– నీళ్ళొస్తున్నాయీ అన్నారు, సరే పట్టుకుంటానూ అన్నాను.  నీ మొహం మా ఇంట్లోకీ అన్నారు. సరే పట్టుకోండి అన్నాను. చూస్తే నేను పెట్టిన బకెట్ లోంచి ఓవర్ ఫ్లో అయి, మా రెండు రూమ్ములూ నిండిపోయి  కింద పోర్షన్ లోకి వెళ్ళాయన్న మాట. నోరెత్తకుండా ఓ బకెట్ తీసికొని ఆ నీళ్ళన్నీ తోడి బకెట్ లోకి తీసి పారపోయాల్సివచ్చింది.. మా ఇంటికి తూములు లాంటివి లేవు. అందుకనే ఒకసారి సుఖాలకి అలవాటు పడిన తరువాత, ఒంటరిగా బతకడం కష్టం.

%d bloggers like this: