బాతాఖానీ —తెరవెనుక ( లక్ష్మిఫణి ) ఖబుర్లు

                                                      

    పెళ్ళికి ముందర ప్రతీ సంవత్సరమూ హైదరాబాద్ శలవు పెట్టి వెళ్ళేవాడిని , మా చిన్నన్నయ్య గారి కుటుంబంతో గడపడానికి.

అలాగే ఒక సారి వెళ్ళినప్పుడు, మా పూనా ఫ్రెండ్స్ వాళ్ళవాళ్ళు ఇచ్చిన సరుకులు ఏవో తీసుకు రమ్మన్నారు.  ఆ రోజుల్లో రైళ్ళలో 2 టైర్ స్లీపర్ అని ఒకటి ఉండేది. దానిలో కింద కూర్చోడానికీ, పైన నిద్ర పోవడానికీ సదుపాయం ఉండేది. రాత్రి 9 గంటలు దాటాక పడుక్కొనేవాడు పైకి ఎక్కాల్సిందే.. నేను ఇలాంటి ఓ 2 టైర్ లో రిజర్వేషన్ చేసికొని, మా ఫ్రెండ్స్ కి తీసికెళ్ళే సరుకులు కూడా నా తో పైనే పెట్టుకొని,(కిందైతే ఎవరైనా కొట్టేస్తారేమో అని భయం ) ఆ బెర్త్ మీదకు ఎక్కేశానండి. జేబులో ఉన్న పర్సూ, నా ఫాక్టరీ  ఐ కార్డూ , అవి అన్నీ నిద్రపోయేటప్పుడు జేబులోంచి పడిపోతాయేమోనని, ఓ జేబు రుమ్మాల్లో కట్టి, షర్ట్ కీ బనీన్ కీ మధ్యలో ఉండేటట్లుగా( ఎలాగైనా ఇన్ షర్ట్ చేస్తాను గా )  ఉంచి పొడుక్కున్నానండి.

                                                      

    ఓ రాత్రివేళ కిందకి దిగుదామని చూస్తే , క్రిందంతా చాలా రష్ గా ఉంది. ఎక్కడా ఖాళి లేదు. పోన్లే అని వదిలేశాను. తెల్లవారు ఝూమున ఇంక అర్జెంట్ అనిపించి  టాయ్లెట్ లోకి వెళ్ళానండి. అక్కడ సామాన్లు ఎవడైనా తీసేస్తాడేమో అని ఒక పక్క భయమూ, ఆ ఖంగారు లో షర్ట్ పైకి తీశానండి, అక్కడ నా పర్సూ అదీ పెట్టానని మర్చిపోయి, ఇంకేముందీ ఆ పర్స్ కాస్తా కింద ఉండే ఖాళీ లోంచి కన్ను తెరిచి మూసే లోపల బయటకు వెళ్ళిపోయింది !! ఏం జరిగిందో తెలిసేలోపల ఆ ట్రైన్ వేగంగా  చాలా దూరం వెళ్ళిపోయింది. ఇంక ఏ పనికైతే వచ్చానో అది కాస్తా మరచిపోయి బెర్త్ మీదకు వెళ్ళి కూర్చున్నాను. నిద్ర ఎక్కడ పడుతుందీ, ఎవడికీ చెప్పుకోలేను. ఏ టికెట్ కలెక్టరైనా వస్తే ఏం చేయాలో తెలియదు. మన దగ్గర ఏగాణీ లేదు. నా దగ్గరున్న సామాన్లైనా ఇచ్చేయాలి, లేకపోతే జైల్లోనైనా కూర్చోవాలి. ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి ని ఎప్పుడూ లేనంతగా ప్రార్ధించేశాను, ఈ కష్టం నుంచి కాపాడితే ఓపిక ఉన్నన్నాళ్ళూ శనివారాలు పగలంతా ఉపవాసాలు చేస్తానని.

                                                       

   ఇంతట్లో తెల్లారింది. ఏ నలుపు కోటు వాడిని చూసినా ఖంగారు, టికెట్ చెక్ చేస్తాడేమో అని. ట్రైన్ ఆగిన ప్రతీ స్టేషన్ లోనూ కిందకు దిగడం, ఒక్క తెలుసున్నవాడైనా కనిపిస్తాడేమో అని వెతకడం. అంత అదృష్టమా నాకు. అప్పటికి ఇంకా 4 గంటల ప్రయాణం ఉంది పూనా రావడానికి. ఎలా గడిపానో ఆ భగవంతుడికే తెలియాలి.

                                                     

    ఎలాగైతే ట్రైన్ లో ఏవిధమైన చెకింగూ లేకుండా పూనా చేరానండి. బయటకు వెళ్ళడం ఎలా ? ఓవర్ బ్రిడ్జ్ మీద కూడా చెకింగ్ అయే ఆస్కారం ఉంది. ఏమయితే అయిందని సామాన్లు నెత్తికెక్కించేసి పూనా స్టేషన్ ప్లాట్ఫారం 6 ద్వారా ( అక్కడ నుంచి తిన్నగా బయటకు వచ్చేయవచ్చు ), పరుగే పరుగు. ఎక్కడా టీ. సీ ల బారి పడకుండా ఓ ఆటో లో ఎక్కి విశ్రాంత వాడి చేరానండి. అక్కడకు వెళ్ళిన తరువాత వాళ్ళదగ్గిర పుచ్చుకొని ఆటో  వాడి ఫేర్ ఇచ్చానండి..

                                                     ఎంత చెప్పినా మా బాస్ శ్రీ వెంకటేశ్వర స్వామి నన్ను ఎక్కడా వీధి ని పెట్టకుండా కాపాడారండీ. అందువలన అప్పడినుంచీ ఈ మధ్యన 2002 దాకా ( నా పళ్ళన్నీ పీకించుకొనేదాకా ) 30 సంవత్సరాలూ ఆ ఉపవాసాలు పాటించేనండి.

Moral of the story :  Never keep things too close to your chest !!

%d bloggers like this: