బాతాఖాని ఖబుర్లు — 20

                                                        

     1972 లో పెళ్ళి అయే ముందర  1971 లో మా ఫాక్టరీ లో అయిన ఒక ముఖ్య సంఘటన గురించి రాయడం మర్చిపోయాను.

మాకు డ్యూటీ పొద్దుట  7.30 నుండి సాయంత్రం  5.30 దాకా ఉండేది.  ఆరోజు ఫిబ్రవరి 4 వ తారీకు, మామూలుగానే 5.30 దాకా డ్యూటీ చేసి ఇంటికి బయలుదేరాను. ఫాక్టరీ నుండి మా ఇంటి దాకా  ఓ మూడు కిలోమీటర్లుండేది. ఎప్పుడూ నడిచే వెళ్ళేవాడిని ( సైకిల్ తొక్కడం రాదు గా ). జనరల్ గా నా కార్యక్రమం ఏమిటంటే సాయంత్రం కొంప చేరగానే ముందర కాఫీ కలుపుకొని తాగడం, ఆ తరువాత కుక్కర్ లో అన్నం పడేసుకోవడం. 6 గంటలకి రేడియో లో ఇంగ్లీష్ వార్తలు వచ్చేవి, అవి వింటూ కాఫీ తాగడం. సడెన్ గా 6.04 నిమిషాలకి ఇల్లు అంతా ఊగిపోవడం మొదలెట్టింది , స్టొవ్ మీద ఉన్న కుక్కర్ కింద కి దొల్లిపోయింది. ఏమయ్యిందో తెలియదు,అక్కడున్న బిల్డింగ్ లో వాళ్ళందరూ బయటకు పరిగెత్తుకొచ్చేశారు, చూస్తే దూరంగా మా ఫాక్టరీ డైరెక్షన్ లో ఆకాశం లో ఓ పేద్ద ” మష్రూమ్ క్లౌడ్” లాగ కనిపించింది. మా ఫాక్టరీ  పేలిపోయింది. మా చుట్టు పక్కల వాళ్ళందరూ ఫాక్టరీ లో పనిచేసేవారే, రేడియో వివిధ భారతీ లో ప్రసారాలు బ్రేక్ చేసి ” ఫలానా ఎచ్.ఈ.ఫాక్టరీ లో పెద్ద పేలుడు సంభవించిందీ, లెఖ తెలియనంతమంది మరణించారూ, చాలా మందికి గాయాలయ్యాయీ అంటూ ఎనౌన్స్మెంట్లు చేశారు. ఫాక్టరీ లో రెండో షిఫ్ట్ లో ఓ రెండు వందలదాకా ఉండి ఉంటారు. ఏమయ్యారో తెలియదూ,మా ఫ్రెండ్స్ పత్తా లెదు. ఇక్కడేమో వాళ్ళ వాళ్ళ ఇళ్ళలో ఆడవారూ, పిల్లలూ ఏడుపులూ, రాగాలూ. మా ఫ్రెండ్స్ కొంతమంది కలసి ఫాక్టరీ వైపు వెళ్ళడానికి ప్రయత్నించాము. పూనా సిటీ లో ఉన్న అన్ని ఫైర్ ఇంజన్లూ, మొత్తం పోలీస్ ఫోర్సూ, ఇసకేస్తే రాలనంత జనం. మా వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు. ఓ 5 గంటల తరువాత మా ఫ్రెండ్స్ అందరూ క్షేమంగా వచ్చారు. 140 మందిని మిలిటరీ హాస్పిటల్ లో చేర్చారు చిన్న చిన్న గాయాలతో, ఒక ఫ్లయింగ్ మిస్సైల్ లాంటిది వెళ్ళి ఒక కిలోమీటరు దూరం లో ఉన్న ఒకావిడ మాత్రం చనిపోయారు.

                                                      

    మర్నాడు పొద్దున్న డ్యూటి కి వెళ్ళగానే చూసిన దృశ్యం జీవితంలో ఎప్పడికీ మరచిపోలేము. ఆ ముందు రోజు బిల్డింగ్ ఉన్న స్థానం లో  100 అడుగుల వైశాల్యం, 40 అడుగుల లోతు ఉన్న ఒక గొయ్యి మాత్రం మిగిలింది. మొత్తం ఫాక్టరీ లో ఏ భాగమూ డామేజ్ అవకుండా లేదు. ఇదే యాక్సిడెంట్ ఓ అరగంట ముందర అయి ఉంటే ఊహించుకోడానికే  భయం వేస్తోంది.

                                                    

     1971 లో పాకిస్తాన్ తో యుధ్ధం అయినప్పుడు మా ఫాక్టరీ రిపేర్లలో ఉంది!! సరీగ్గా 8 నెలలో అన్ని పనులూ పూర్తిచేసి ఫాక్టరీ ని మళ్ళీ వర్కింగ్ కండిషన్ లోకి తెచ్చారు.  మా అందరినీ రెండు షిఫ్ట్ లలో డ్యూటీ కి రమ్మన్నారు, అంటే  ఉదయం 6.00 నుంచి సాయంత్రం 6.30, అలాగే సాయంత్రం నుంచి ఉదయం దాకా, వారం విడిచి వారం ఆదివారాలూ, అంటే వారానికి  72 గంటల చొప్పున పనిచేశాము. అడక్కండి ఆ రోజుల్లో మా పాట్లు!! అప్పుడే కొత్త గా పెళ్ళయ్యింది, చూస్తే నా డ్యూటి ఇలాగ, మా కొత్త పెళ్ళికూతురు హడలిపోయింది !! ‘ కార్మికుల కార్యక్రమాలు’ వచ్చేవి ఆరోజుల్లో హైదరాబాద్ రేడియో లో, ఈవిడనుకొందీ, మా ఇంటాయనది ఏదో పెద్ద ఉద్యోగం, సాయంత్రాలు చక్కగా షికార్లు చేయచ్చూ అలాంటివన్నీ, నాకైతే సగం జీవితం ఫాక్టరీ లోనే అయిపోయేది.

                                                  

      ప్రతి రోజూ ఇంటి భోజనం– ఓ కుర్రాడి చేత డబ్బా ( కారీర్ ) తెప్పించుకొనేవాళ్ళం. వాడు చాలా చిన్నవాడు. ఫాక్టరీ కి వచ్చేదారిలో ఎప్పుడైనా ఆకలేస్తే మా డబ్బాలు తీసి కావల్సినది తినేసేవాడు!! అంటే వాడు తినగా మిగిలనది మేము తినేవాళ్ళమన్నమాట. చాలా కాలం మాకు ఈ సంగతి తెలియలెదు. ఒకసారి ఇంటికి రాగానే అడిగింది —  అదేదో కూర ఆవ పెట్టి చేశాను ఎలా ఉందీ–అని అస్సలు కూర లేదూఅంటే నమ్మదే. మా మిగిలిన ఫ్రెండ్స్ ఇళ్ళల్లోనూ ఇలాగే అయింది. మర్నాడు దారి కాసి చూస్తే డబ్బాఆ కుర్రాడి లీలలు తెలిసాయి.ఇంక ఈ డబ్బా వాడిని మాన్పించేశాము. డబ్బా పొద్దున్నే లేచి తయారు చేసేది.మొత్తం 33 సంవత్సరాలూ ( ఏదో తను ఊరికి వెళ్ళినప్పుడు తప్ప )ప్రతీ రోజూ తనచేతి వంటే  తిన్నాను. అదొక అదృష్టం.

                                                  

    ఓ నాలుగు నెలల తరువాత ఫాక్టరీ మామూలు స్థితి కి వచ్చింది . అంటే వారానికి 54 గంటలు. ఆదివారాలు శలవు. ప్రతీ వారమూ, సినిమాకి వెళ్ళిపోవడమే. నెలకొక కొత్త చీర కొనడం, బలే రంజుగా ఉండేదండి. వచ్చిన గొడవేమిటంటే ఎప్పుడూ నా కళ్ళకి ” ఆరెంజ్ ” కలరే నచ్చేది.అందువలన ఈవిడ పాపం ఎప్పుడు చూసినా ఆ రంగు చీరలోనే ఉండేది. నేనే వెళ్ళేవాడిని చీరలు సెలెక్ట్ చేయడానికి, అదో ఆనందం. పాపం తనుకూడా ఏమీ

అనుకోకుండా వేసికొనేది. మేము  మార్చ్ లో పూనా వచ్చాము. మే నెలలో మా సిస్టర్ పెళ్ళి కుదిరందన్నారు. చూడండి ఈవిడ వచ్చిన వేళా విశేషం. సో ఈసారి తలెత్తుకొని అమలాపురం వచ్చేను.  ఓజోక్ ఏమిటంటే–మా అమ్మ గారు మాఇంటావిడని అస్తమానూ ఆరెంజ్ రంగు చీరలోనే చూసి చూసి, ” ఏం అమ్మా స్నానం చేసిన తరువాత బట్ట మార్చుకోలేకపోయావా “. ఈవిడ ఇంక ఉరుకోలేక పెట్టి తెరిచి ” మీ అబ్బాయి కి ఈ రంగు తప్ప ఇంకోటి నచ్చదు, చూసుకోండి కావలిస్తే “. అంది.

మా అమ్మగారు నాతో ” ఇదేమి రంగు రా ఏదో మఠం లో వాళ్ళ లాగ ”  అన్నారు.

%d bloggers like this: