బాతాఖానీ ఖబుర్లు—-19

                                                    

    ఆ మర్నాడు అన్నవరం కొండమీద క్యాంటీన్ లో పెళ్ళి భోజనాలు చేసి ఆ రాత్రికి అమలా పురం వెళ్ళిపోయాము. అన్ని కార్యక్రమాలూ పూర్తిచేసి ఒక వారం లో హైదరాబాద్ వెళ్ళాము. అక్కడినుంచి బొంబాయి ఎక్స్ ప్రెస్స్ లో ఫర్స్ట్ క్లాస్ తీసికొని పూనా బయల్దేరాము. ఆ ప్రయాణం లో నే మా పదహారు రోజుల పండగ చేసుకోవాల్సి వచ్చింది. ఆరోజు కి మా నాన్నగారు ఏదో ముహూర్తం పెట్టి మా ఇంటావిడ ని మంగళసూత్రాలు రెండింటినీ ఒక చెయిన్ లో వేసుకోమని చెప్పారుట. ఆ కంపార్ట్మెంట్  లో ఒక మిలిటరీ ఆయన కూడా మాతో ప్రయాణం చేస్తున్నారు. ఈవిడేమో మామగారు చెప్పినట్లుగా మంగళసూత్రాలు ఒక చెయిన్ లో వేసుకోవడానికి, అవి తీసింది. ఆ మిలిటరీ ఆయనకి ఖంగారు పుట్టింది– ఇదేమిటీ పాపం  కొత్తగా పెళ్ళి అయినట్లు కనిపిస్తున్నారూ, ఈ అమ్మాయేమో మెడలో సూత్రాలు తీసేసిందీ,  గొడవలేమైనా వచ్చాయా, అని చాలాసేపు ఆలోచించి చివరకు ధైర్యం చేసి ( హాత్తెరీ నువ్వెవరు మా గొడవలో కలగచేసుకోడానికీ అని మా ఆవిడ కోప్పడుతుందేమోనని ఒకవేపు భయం ) అడిగేశారు. “ఏదైనా గొడవలుంటే పెద్దవాళ్ళతోటి ఆలోచించి సెటిల్ చేసుకోవాలి కానీ ఇలా మంగళసూత్రాలు తీసేయవచ్చా ? “. మా ఇద్దరికీ అయితే చచ్చేంత నవ్వు.ఆయనకి మన సంప్రదాయం గురించి ఓ లెక్చర్ ఇచ్చి ఆయనని ఊరుకోపెట్టాము !!

                                                 

     మరుసటి రోజు పొద్దుట పూనా లో దిగామండి. టాక్సీ చేసికొని కొంపకి చేరాము.  అప్పుడు పూనా లోని విశ్రాంతవాడి దగ్గర కలాస్ లో ఉండేవాడిని. రెండు రూమ్ములూ, ఒకటి నిద్రపోవడానికీ, రెండోది  కిచన్ కం బాత్రూం,కం ఎవరైనా గెస్ట్ లు వస్తే వాళ్ళని ముందు రూమ్ లో పడుక్కోపెట్టి మేము అక్కడ నిద్రపోవడం. ఆల్ ఇన్ వన్  ప్యాలెస్ అన్నమాట. అక్కడ ఉన్న  10 కాపురాల వాళ్ళకీ రెండంటే రెండు మాత్రమే టాయిలెట్లు.  ఈవిడ రియాక్షన్ ఎలా ఉందో అని చూశాను. పూర్తిగా మాట పడిపోయింది,    ఎక్కడ ఏంచేయాలో తెలియదు. మర్చిపోయానండోయ్ ఆ రెండో రూమ్ లో ఓ పేధ్ధ చెక్క బాక్స్ ఒకటి ఉండేది, దాంట్లో

మా రూమ్ లో ఉన్న చెత్తంతా దాచేశాను. పూనా నుంచి బయల్దేరేముందు ఇలా నేను పెళ్ళి చేసికొని జంట గా వస్తానని అనుకోలేదు గా ఒబ్బిడిగా సర్దిఉంచలేదు.

ఈవిడకేమో అసలు ఎక్కడినుంచి మొదలుపెట్టాలో తెలియలేదు. మా తెలుగు ఫ్రెండ్స్ అందరూ, మా పక్కింటి వాళ్ళ అమ్మాయిని హాస్పిటల్ లో చేర్చారని అక్కడకు వెళ్ళారు.ఇంకో తెలుగు ఫ్రెండ్, ( ఆవిడది ముక్కామల ) భోజనానికి పిల్చారు. మా ఇంటావిడ అక్కడే స్నాన పానాదులు కానిచ్చేసింది, భోజనం కూడా అక్కడే.

                                                   

    నేను పెళ్ళి చేసికొని వస్తున్నాని తెలుసు అందరికీను. పాపం  స్వాగత సత్కారలతొటి రిసీవ్ చేసికొందామనుకొన్నారు కానీ, ఒక ఫ్రెండ్ వాళ్ళ చిన్నపాపని హాస్పిటల్ లో చేర్చడం వల్ల ఆకార్యక్రమాలన్నీ మానుకోవలసివచ్చింది. మేమిద్దరమూ ఆ సాయంత్రం ఆ పాప వాళ్ళు ఉన్న హాస్పిటల్ కే వెళ్ళాము. మా పరిచయాలు అన్నీ అక్కడే జరిగాయి. నాకు రొజూ పొద్దున్నే ఒకావిడ పాలు పోసేవారు. నుదుట నిండుగా బొట్టు తో, పొద్దున్నే వచ్చి నన్ను లేపడం, ఆవిడ పోసే పాల సంగతి అడగొద్దు, ఆవిడని  పొద్దుటే చూడడం కోసమే పాలు పోయించుకొనేవాడిని. నన్ను ” బాబా ” అని పిల్చేది. ఆవిడని నేను గంగమ్మా అనేవాడిని. ఆవిడ అసలు పేరు నాకు తెలియదు. మర్నాడు పొద్దున్నే వచ్చేడప్పడికి ఇంట్లో ఈ కొత్త కారెక్టర్ ఎవరా అనుకొంది, పరిచయం చేశాను.

                                                  

     చెప్పాను కదండీ  నాకు సంసారానికి కావల్సిన  ” ఇన్ఫాస్ట్రక్చర్ ” అంతా ఉండేది. వచ్చిన గొడవల్లా ఏమిటంటే, ఆ సరుకులన్నీ ఎవరెవరింట్లోనో ఉండేవి. ఒక్కడినే కదా అనేసి ఎవరికి కావల్సినవి వాళ్ళు తీసికెళ్ళిపోయేవారు. పోనీ ఎవరో ఒకరు ఉపయోగించుకుంటున్నారు కదా అని నేనూ ఏమీ పట్టించుకొనేవాడిని కాదు.. ఏ సరుకు ఎక్కడుందో అయినా తెలియాలి కదా,అబ్బే అలాంటిది ఏమీ లేదు. ఈవిడకేమో వాళ్ళ అత్తగారు వచ్చేడప్పుడు అన్నీ విపులంగా చెప్పేరుట, ” వాడి దగ్గర ఫలానా, ఫలానా గిన్నెలున్నాయి, అవేవో ఉన్నాయి  అంత అర్జెంట్ గా ఏమీ కొనుక్కోనఖర్లేదు”. చూస్తే ఏమీ కనిపించవూ, అడగాలంటే ఏమైనా అనుకుంటానేమో నని భయం, ఎలాగోలాగ నాచేత వాగించింది. పెళ్ళి అయిన తరువాత సంసారానికి నేను కొన్న మొదటి వస్తువు ఏమిటో తెలుసా– కత్తి పీట– మోస్ట్ అన్రొమాంటిక్  స్టార్ట్ . మా అవిడైతే హడలి పోయింది. ఇదేమిట్రా భగవంతుడా నేనేమైనా తప్పుగా మాట్లాడానా, కత్తిపీట పట్టుకొచ్చాడూ నా మొగుడూ అనుకొంది.

( ఆ కత్తి పీట ఇప్పడికీ మాతోటే ఉంది. రాజమండ్రీ కాపురానికి కూడా తీసుకొచ్చాము !! ).

                                                 అప్పడివరకూ ప్రతీ శనాదివారాలు ఎవరో ఒకళ్ళ ఇంట్లో అందరికీ ఫలహారాలయ్యేవి. ఈ సారి, కొత్తగా వచ్చిందనేనా చూసుకోకుండా

   ఈవిడని ఇడ్లీ లు చేసిపెట్టమన్నారు. మొత్తం ఏడు ఫామిలీలు అంతా కలిపి ఓ రెండొందలు చేయవలసి వచ్చింది. తీసికొన్నవాళ్ళేమో నా మిక్సీ తిరిగి ఇవ్వలేదూ,ఈవిడెమో పక్క వాళ్ళింటికి వెళ్ళీ ఓ అర బకెట్  పిండి రుబ్బుకొచ్చింది, అది పులుస్తే ఓ బకెట్టుడైయ్యింది !! తణుకు లో అయితే శనాదివారాలు ఏదో ఉప్పుడు పిండి  లాంటివి అలవాటు. ఈ పిండీ అదీ రుబ్బురొల్లో చెసేటప్పడికి ఈవిడకి చేతులంతా పుళ్ళైపోయి ఏడుస్తూ కూర్చొంది. మర్చిపోయాను, మాకొక గెస్ట్ కూడా వచ్చేడండోయ్. మా కజిన్ ఎదో ఆపరెషన్ కోసం పూనా వచ్చేడు, మా ఇంట్లోనే దిగాడు. వాడిదీ తణుకే, ఇంటికి తిరిగి వెళ్ళిన తరువాత ” వదిన కి ఊళ్ళోవాళ్ళందరికీ ఇడ్లీలు చేయడం” అని చెప్పేస్తాడేమో అని భయం, పాపం ఇంత దూరం లో మన పిల్ల ఎన్ని కష్టాలు పడుతూందో అని,వచ్చేసి వాళ్ళ పిల్లని తీసికెళ్ళిపోతారేమో అని నాకు భయం.!!

%d bloggers like this: