బాతాఖానీ ఖబుర్లు —18

                                                            

          ఆ మర్నాడు మా కజినూ, అవబోయే మామగారు వస్తారో రారో అని రాత్రంతా ఆదుర్దాయే. ఏ మైతేనే మర్నాడు పొద్దున్నే మా కజిన్ ముందర వచ్చాడు, తండ్రీ కూతురూ విడిగా వచ్చారు. ముగ్గురు కలసి వస్తే పని అవదని. వాళ్లిద్దరూ మా అమ్మమ్మ గారింటికి భోజనానికి ఉండిపోయారు ( మా ఇంట్లో భోజనం చేయకూడదు ట ). మా అమ్మమ్మ గారు ఆ అమ్మాయితో నేను చెప్పినవన్నీ వివరంగా మాట్లాడారుట ( ఆ సంగతి ఆవిడ తరువాత చెప్పారు). ఏమైతేనే మొత్తనికి నా పెళ్ళి అవబోయే సూచనలు కనిపించాయండి. ఆ అమ్మాయి మా ఇంటికి వచ్చింది. ఏదైనా మాట్లాడుదామంటే ఏమనుకొంటారో అని భయం. అందరూ మాట్లాడుకొన్నదేమంటే ముహూర్తాలు ఎప్పుడూ అని, అదికూడా నాకు గాలిలో వినిపించింది, ( నాతోటి ఎవరైనా మాట్లాడితేనా!!). మొత్తానికి ” ఫణిగాడు పెళ్ళికొడుకాయనే ” అని పాడేసుకొన్నాను. అన్నవరం లో పెళ్ళి చేయడానికి నిశ్చయించారు.ఫిబ్రవరి 28 వ తారీకున. మా ఫ్రెండ్స్ అందరికీ  ఉత్తరాలు రాసెశాను. మానాన్నగారు కూడా చుట్టాలందరికీ కార్డ్లు రాసేశారు. పర్వాలేదూ, నేనూ ఓ ఇంటివాడనౌతున్నాను అనుకొన్నాను. మా అవబోయే మామగారు ఓ రెండు రోజులైన తరువాత వచ్చి ఉంగరానికి సైజు తీసికొన్నారు.  వాళ్ళైతే కార్డ్లు కూడా ప్రింట్ చేయించారు ( మాకంటే చాలా మెరుగు!! ) అప్పడికి నాకు గ్యారెంటీ వచ్చింది పెళ్ళి అవుతుందీ అని.

                                                            

         ఒ వాన్  పిఠాపురం దాకా  మాట్లాడుకొన్నాము. అక్కడ మా పెద్దన్నయ్య గారు ప్రిన్సిపాల్ గా పనిచెసేవారు. అక్కడ స్నాతకం చేసికొని ఆ సాయంకాలానికి  అన్నవరం  వెళ్ళేటట్లు ప్రోగ్రామ్. మేము అమలాపురం నుంచి    ఆ వాన్లో వస్తూన్నప్పుడు కాకినాడ లో ఏదో బంధ్ వ్యవహారాలు అవుతున్నాయి. అన్ని వాహనాలూ ఆపేస్తున్నారు. మాదికూడా ఆపేశారు. ఇదెక్కడి గొడవరా బాబూఅనుకొన్నాను.  అవక అవక నాకు పెళ్ళి అవుతూంటే ఇన్ని విఘ్నాలా ?

                                                           

       ఎలాగైతేనే సాయంత్రానికి అన్నవరం చేరామండీ. పెళ్ళికూతురు వాళ్ళు వస్తారో రారో అని భయం, ఏదైనా ఆఖరి నిమిషం లో ఆలోచించి ఈ సంబంధం ఎందుకూ, చూస్తూ చూస్తూ అలాంటి పిల్లాడికి ఇవ్వడం ఎందుకూ అనుకొని ఏమైనా మనస్సు మార్చుకొన్నారేమో, అన్నీ అనుమానేలే.చెప్పానుకదండీ  జీవితం లో  నాలాంటివాడిని ఏ అమ్మాయైనా మనస్సారా ఒప్పుకొని వివాహం చేసికొంటుందని ఎప్పుడూ అనుకోలేదు.

                                                            

     ఇంతట్లో ఎవరో వచ్చి చెప్పారు పెళ్ళివారు వచ్చేరని. అమ్మయ్య వచ్చేరురా బాబూ అనుకొని ఆ భగవంతుడికి మనసారా ఓ నమస్కారం పెట్టుకొన్నాను. ఎవరో వచ్చి మా ఇద్దరినీ దేవస్థానం ఆఫీస్ లోకి తీసికెళ్ళారు సంతకాలు చేయించడానికి. సో..సెకండ్ స్టేజ్ దాటేశామన్న మాట.  మా పెళ్ళి చూడడానికి మా పెదనాన్నగారొకరు వచ్చారు, ఆయన ముక్కామల లో ఉంటారు. యజ్ఞాలు చేసినాయన, ఎప్పుడూ ఊరు వదలి బయటకు వెళ్ళరు. అలాంటి ఆయన మా పెళ్ళికి రావడం నా అదృష్టం గా భావిస్తాను. మా పెళ్ళి చేయించే పురోహితుడిని ఆయన ఇంటర్వ్యూ చేయడం మొదలెట్టారు, ( అతనికి పెళ్ళి మంత్రాలు వచ్చునో లేదో తెలిసికోవడానికి ). ఇన్ని టెన్షన్ ల మధ్య ఏమైతేనే మా పెళ్ళి ఫిబ్రవరి 28, 1972 నాడు శ్రీ సత్యనారాయణ స్వామి వారి సన్నిధి లో శాస్త్రోక్తం గా అయిందండీ.

                                                         

     ఒక విషయం చెప్పండి–ఆ రోజుల్లో సుధామూర్తి గారు వ్రాసిన ” మహాస్వేత ” పుస్తకాలు లేవు,ఎ విషయమూ నేను కానీ, మా అమ్మమ్మ గారు కానీ దాచలేదు. ఆ అమ్మాయి మనసా, వాచా నన్ను నన్నులాగ స్వీకరించి నా జీవితం లోకి ప్రవేశించింది. నా అంత అదృష్టవంతుడు ఎవరైనా ఉంటారా ఈ ప్రపంచం లో!!  ఏ నాడూ నాకున్న తెల్ల మచ్చల గురించి ప్రస్తావన తీసుకురాలేదు. తరువాత శరీరం అంతా వ్యాపించింది. అయినా ఎటువంటి సందేహం లేకుండా తనకు తాను పూర్తిగా నాకు ఒక స్ఫూర్తి గా నిలిచి నాకు ఒక కొత్త జీవితాన్నిచ్చింది.. భగవంతుడిని నేను ప్రతీ రోజూ ప్రార్ధించేదేమంటే తనకి అన్నివేళలా శుభం కలగ చేయమని. నాకేమైనా పర్వాలేదు, తనుమాత్రం ఆనందం గా ఉండాలి.

                                                     

      ఇప్పడికి 37 సంవత్సరాలు పూర్తి అయ్యాయండీ. ఇన్ని సంవత్సరాలలోనూ మేము ఏదో ఐడియల్ కపుల్ లాగ ఉన్నామనడం లేదు. చిన్న చిన్న దెబ్బలాటలూ అన్నీ ఉన్నాయి. ఆలోచిస్తే చాలా సందర్భాలలో నేనే తప్పు చేశానని. కానీ ఆ ఉద్రేకం లో ఒప్పుకోముగా. అదే నా బలహీనత.

    I am proud of my wife.

బాతాఖానీ —తెరవెనుక ( లక్ష్మిఫణి ) ఖబుర్లు

                                                              నేను  జీవితంలో రెండే రెండు సార్లు మెడికల్ ఎక్సామినేషన్ అనే దానికి గురి అయ్యాను. మొదటిది ఉద్యోగం లో చేరేముందరా, రెండోది 10 సంవత్సరాల తరువాతా. అప్పటికి  పెళ్ళయ్యింది. ఈ  పది సంవత్సరాలూ, ఫాక్టరీ లో ప్రతీ ఏడాదీ మెడికల్ టెస్ట్ అయ్యేది. ఏదో తూతూ మంత్రం లాగ. గుండె కొట్టుకుంటోందా లేదా అని చెక్ చేసి ఆ ఏడాది గట్టెక్కించేసేవారు. నేను క్రిందటి సారి  నా ఖబుర్లు –17 లో చెప్పానూ, మా ఆవిడకీ, అవబోయే అత్తగారికీ తేడా తెలియలేదూ అని. నిజం అండీ –నాకు దూరంగా ఉన్నవి కనిపించేవికాదు. కళ్ళజోడు పెట్టుకోవడానికి సిగ్గూ, మొహమ్మాటమూ. సినిమాకి వెళ్తే ఆ సెన్సార్ సర్టిఫికేట్ కనిపించేది కాదు, బస్సుల గురించి ఆగితే దాని నెంబరు కనిపించేది కాదు. అయినా ఎలాగోలాగ బండి లాగించేసి ఓ ఇంటివాడిని కూడా అయ్యాను ( భగవంతుని దయ వలన )..

                                                            ప్రస్తుతానికి వస్తే– ఆ ఏడాది మెడికల్ టెస్ట్ లలో కళ్ళ పరీక్షకూడా చేస్తున్నారన్నారు. ఇంకేముందీ నా బండారం బయట పడిపోతుందీ అని భయ పడ్డాను. అయినా  మానవ ప్రయత్నమేదో చేయాలిగా., టెస్ట్ చేసే రూమ్ లోకి, డాక్టర్ గారు వచ్చేలోపల కళ్ళు టెస్ట్ చేసే బోర్డ్ మీద ఉన్న అక్షరాలన్నీ బట్టి పట్టేశాను !! ఇంతలో ఆయన వచ్చి బోర్డ్ కి కొంచెం దూరం లో నిల్చోపెట్టి, అక్కడ ఉన్నవన్నీ చదువూ అన్నారు. మనకేంభయం అన్నీ టక టకా చదివేశాను. ఓ కన్ను మూసి మళ్ళీ చదవమన్నారు. చదీవేశాను. ఆయన ” అర్రే నీ సైట్ చాలా బాగుందీ” అని సంతకం పెట్టే ముందర ఓ సారి కన్ఫర్మేషన్ కోసం, ” ఆ మూడో లైన్లో రెండో అక్షరం చదువు ” అన్నారు. ఏదో వరుసగా అయితే గుర్తున్నాయి కానీ, నాకైతే మొదటి లైన్లో రెండో అక్షరమే మసక మసగ్గా కనిపిస్తుంది.. ఇంకేముందీ ఆయనకి తెలిసిపోయింది ” వీడేదో ట్రిక్ ప్లే చేశాడూ”అని. కొంపలు మునిగిపోయాయి. నన్ను ఆయన మళ్ళీ టెస్ట్ చేసి, ఓ వార్నింగ్ ఇచ్చారు ” నిన్ను ఉద్యోగానికి అన్ఫిట్ చేస్తాను,వారం లోగా కళ్ళు టెస్ట్ చేయించుకొని వస్తే సరేసరి లేకపోతే నీ ఉద్యోగం ఇప్పడితో ఆఖరు “అని.

                                                           ఫాక్టరీ నుంచే ఎం.జీ.రోడ్ కి వెళ్ళి  డా. మాస్టర్స్ అనే ఆయనదగ్గరకు వెళ్ళాను. ఆయన నన్ను చెక్ చేసి ” నీకు కళ్ళజోడు లేకుండా ఉద్యోగం ఎలా ఇచ్చారూ” అన్నారు. సంగతేమంటే నా నెంబరు  – 6 వచ్చింది. భూతద్దాలలాంటి కళ్ళ్జజోడు పెట్టుకోవాలన్నమాట !! అదేదో కొట్లో ఆ ప్రిస్క్రిప్షన్ ఇచ్చేసి ఇంటికి వెళ్ళిపోయాను. ఇంట్లో చెప్పలేదు, నన్ను నమ్ముకొని మా మామగారు పిల్లనిచ్చారూ, ఈ సంగతి తెలుస్తే వాళ్ళ అమ్మాయిని తీసుకుపోతారేమో అని భయం !!

                                                           ఓ  నాలుగు రోజుల తరువాత నా కళ్ళజోడు తీసికొన్నానండీ. ఇంక చూసుకోండి, అన్నీ కనిపించడం మొదలెట్టాయి. రోడ్డు మీద నడుస్తూంటే అదంతా నామీదకు  వస్తూన్న ఫీలింగూ,బస్సుల నెంబర్లు కనిపించాయండోయ్. ఎలాగైతేనే కొంపకి చేరానండి.మా ఆవిడని మనసారా చూసుకొన్నాను. ఏదో కోతికి కొబ్బరికాయ దొరికినంత సంబరం!! ఆ రోజు సాయంత్రం మేం ఇద్దరమూ, వెస్టెండ్ టాకీస్ లో ” అంకుర్ ” సినిమాకి వెళ్ళాము. కనిపిస్తోందికదా అని, సర్టిఫికేట్ దగ్గరనుంచీ అన్నీ పైకి చదవడం మొదలెట్టాను. ఏదో పాపం వయొజన విద్యా కార్యక్రమంలో ఈ మధ్యనే చదవడం నేర్చుకొన్నాడనుకొన్నారు పక్క వాళ్ళంతా!!

సినిమా నుండి తిరిగి వస్తూ, దూరంగా ఉన్న కొండమీద ఏవో లైట్లు కనిపించాయి. ఊరుకోవచ్చా ” అర్రే ఈ మధ్యన ఆ కొండమీద లైట్లు పెట్టారోయ్ ” అన్నాను పెద్ద గొప్పగా. మా అవిడ ఇంక ఊరుకోలేక ” అవి మీరు పుట్టనిక్రితం నుంచీ ఉన్నాయి ఇంక నోరు మూసుకొండి .” అంది.

%d bloggers like this: