బాతాఖానీ ఖబుర్లు —–17

                                                    

    చెప్పేనుగా నేను ఈ 9 సంవత్సరాలూ సెలవు పెట్టి హైదరాబాద్ వరకూ మాత్రమే వెళ్ళేవాడిని. తెలుగు సినిమాలూ అవీ అక్కదే చూసేవాడిని. పూనా లో మాత్రం ” నిషాత్ ” టాకీస్ లో అప్పుడప్పుడు తెలుగు సినిమాలు చూసేవాళ్ళం. నాకు రోజూ కాలక్షేపానికి ఏమీ లోటుండేదికాదు. అక్కడ ఉన్న తెలుగు వాళ్ళింటికి ఎప్పుడైనా ఎవరైనా వచ్చినా, మా రూమ్ కే వచ్చేసేవాళ్ళు. అంత పాప్యులర్ అయిపోయాను. ఎవరూకూడా నాకున్న ” ప్రోబ్లెమ్” గురించి ఏమీ ప్రస్తావించేవారు కాదు. బహుశా ఈ కారణం వల్లనేమో వీళ్ళందరి తోటీ నాకు చాలా అవినాభావ సంబంధం ఏర్పడిపోయింది..

                                                    

      నాకు ఇంతలాగా ఉన్నా కూడా ఏదో ఒక రకమైన విచారం ఉండేది. నాకు గూడా పెళ్ళైతే నాకు కూడా ఒక ” వ్యక్తిత్వం ” వస్తుందేమోనని. కానీ నాకున్న రూపానికి పిల్లనిచ్చేదెవరు? నన్ను చూస్తేనే మా చెల్లెలికి పెళ్ళి అవదేమోనని భయ పడిన వాళ్ళు, నాకు సంబంధాలు ఎలా చూస్తారూ? అలా అని ఎవరినో ఒకరిని వివాహం చేసికొనే ధైర్యం కూడా లేదు. ఇంక నా జీవితం ఇంతేలే అనే ఒక నిరాశా, నిస్పృహా వచ్చేశాయి. ఈ నా మనోభావాలన్నీ ప్రస్తావిస్తూ మా నాన్నగారికి ఓ పెద్ద ఉత్తరం రాసేశాను ఆ వేడిలో. ఇంక ఐపోయిందీ, నాకూ, మా వాళ్ళకీ సంబంధాలు ఇంక పూర్తిగా చెడిపోయినట్లే ఈ ఉత్తరం తోటీ అనుకొన్నాను. కానీ ఆశ్చర్యకరంగా , నాకు మానాన్నగారి దగ్గరనుండి ఓ ఉత్తరం వచ్చింది— ఫలానా తారీకుకి ఫలానా ఊరికి రా, అక్కడకి మీ పెద్దన్నయ్య వస్తాడూ, మీ ఇద్దరూ కలసి ఓ సంబంధం ఉంది, అది కుదిరితే ఖాయం చేద్దామూ అని. ఎవరో ఒకరు పెళ్ళి అయితే చాలు అనుకొన్నాను.

                                               

           నేను బయల్దేరి ఆ ఊరు వెళ్ళి చూశామండీ. అమ్మాయి ఎలా ఉందీ అని కాదు సమస్య, నేను నచ్చుతానా లెదా అనేది ప్రశ్న !!అడగలేను ( ఆ రోజుల్లో ఇప్పటిలాగ విడిగా మాట్లాడుకోవడాలూ అవీ లేవు కదా !!), ఊరెళ్ళిన తరువాత అభిప్రాయం చెప్తామని మా అన్నయ్య గారు చెప్పేశారు. ఇదేమిటీ ,ఇప్పుడే చెప్పెయ్యచ్చుకదా, వచ్చిన ఒక సంబందానికీ మళ్ళీ ఈ “డిలే” ఎందుకూ అని మహ మధన పడిపోయాను.. అక్కడనుంచి మేమిద్దరమూ, తణుకు, మా పెద్దమ్మ గారింటికి వెళ్ళాము. మేము భోజనం చేసి ఖబుర్లు చెప్పుకొంటుండ,ఓ ఇద్దరు స్త్రీలు వచ్చారు అక్కడికి.
                  

      అక్కడనుంచి  ఆ సాయంత్రానికి అమలాపురం వెళ్ళిపోయాము. ఆరోజు రాత్రి  మా అమ్మమ్మ గారు వచ్చారు మాఇంటికి నన్ను చూద్దామని. మాటల్లో అడిగారు నువ్వు చూసిన సంబంధం ఎలా ఉందీ అని. నేను పెళ్ళైతే చాలు అనుకొని నచ్చిందీ అని చెప్పేశాను. ఈవిడకేమో ఆసంబంధం అంతగా నచ్చలేదు, ఏవేవో కారణాలు చెప్పారు. మా అమ్మమ్మ గారి మిద నాకు చాలా గౌరవమూ, భక్తీ ఉన్నాయి.. పోనీ ఏం చేద్దాం అని అడిగాను. నువ్వు తణుకు వెళ్ళినప్పుడు చూసిన అమ్మాయి ఎలా ఉందీ అన్నారు. నేను అక్కడ ఉండగా  ఓ ఇద్దరు వచ్చారూ, అందులో ఎవరిగురించి అడుగుతున్నావూ అన్నాను, ఇద్దరూ బాగానే ఉన్నారు అన్నాను!!. ఛా వెధవా వాళ్ళిద్దరూ తల్లీ కూతుళ్ళూ, అందులో కూతురు నచ్చిందా అన్నారు.. ఎవరో కొంచెం ఛాయ ఉన్నావిడ బాగానే ఉందీ అన్నాను. ఆ తరువాత తెల్సిందీ, నేను బాగానే ఉంది అన్నావిడ మా కాబోయే అత్తగారుట !!
                                              

       మర్నాడు పొద్దుటే, ఓ ఇద్దరు పెద్దమనుష్యులు వచ్చారు మా ఇంటికి ( ముందర చూసిన సంబంధం వాళ్ళు ). మా నాన్నగారు అడిగారు లోపలికి తీసికెళ్ళి,  ” ఏం చెప్పమంటావు వీళ్ళకి ” అని, చేతుల్లోకి వచ్చిన సంబంధం పోతుందేమోననుకొని ” సిగ్గు ” పడిపోతూ ఓకే అన్నాను..మేం ఇద్దరం చావిట్లోకి వచ్చి చెప్పబోయేలోపులో, గేట్ లోంచి, మా కజిన్ , అవబోయే మామగారు వచ్చారు.అక్కడినుంచే పరిస్థితి అర్ధం చేసికొని, మమ్మల్ని ఏమీ చెప్పకుండా ఆపేశారు. ఆ పెద్దమనుష్యులతో ఎదో సమాధానం చెప్పేసి వాళ్ళని పంపేశారు.

 

   ఇద్దరం చావిట్లోకి వచ్చి చెప్పబోయేలోపులో, గేట్ లోంచి, మా కజిన్ , అవబోయే మామగారు వచ్చారు.అక్కడినుంచే పరిస్థితి అర్ధం చేసికొని, మమ్మల్ని ఏమీ చెప్పకుండా ఆపేశారు. ఆ పెద్దమనుష్యులతో ఎదో సమాధానం చెప్పేసి వాళ్ళని పంపేశారు.
                                                   

       మళ్ళీ రెడ్డొచ్చె మొదలాట అయినట్లుంది నా సంగతి–ఏదో నచ్చిందని చెప్పినా వాళ్ళని పంపేశారూ, వీళ్ళకి నా పెళ్ళి చేయడం ఇష్టం లేదూ అనుకొన్నాను. ఒఖ రొజు ఆగరా బాబూ అన్నారు మా అమ్మమ్మ గారు. ఆ రాత్రి ఆవిడ తో చెప్పేసాను– “నన్ను పెళ్ళి చేసికొనే అమ్మాయి కి  నాగురించి అన్ని సంగతులూ వివరంగా చెప్పు,  మనవాళ్ళందరూ పబ్లిసిటీ ఇచ్చినట్లుగా నాకున్నది ఏమీ   యెలర్జీ అదీకాదు. కొన్ని రోజులలో శరీరం అంతా రావచ్చూ, పుట్టె పిల్లలు ఎలా ఉంటారో తెలియదు ( ఆ రోజుల్లో ఇలాంటివన్నీ చెప్పి భయ పెట్టేవారు ), నువ్వు అన్నింటికీ సిద్ధ పడితేనే మావాడు ఈ పెళ్ళికి ఒప్పుకుంటాడు” అని.

                                                     

      మా అమ్మమ్మ గారు అన్నింటికీ ఒప్పుకొని ” నువ్వు చెప్పమన్నట్లుగా అన్ని విషయాలూ, ఏమీ దాచకుండా ఆ పిల్లకి చెపుతానూ, అన్నింటికీ మనస్సారా ఒప్పుకుంటేనే ఈ పెళ్ళి నిశ్చయిద్దామూ “. అన్నారు. ఇంక ఆవీడమీదే అంతా భారం వేశాను. అమ్మాయైతే చాలా బాగుంది, సంసారపక్షంగా, ఒప్పుకుంటే బాగుండును అనే భావం వచ్చింది. ఏమో నా యోగం ఎలా ఉందో ?

 

                                        

                                                      

                                                      

                                                       

%d bloggers like this: