బాతాఖాని–తెరవెనుక (లక్ష్మిఫణి) ఖబుర్లు

                                                            

    నేను 2005 లో రిటైర్ అయ్యాను.  మా ఫ్రెండ్ సర్కిల్ లో ప్రతీవాడి దగ్గరా పాస్ పోర్ట్ లు ఉన్నాయి. నేను మాత్రం ఎందుకు తీసికోకూడదూ అని నిశ్చయించుకొని  ఓ ఏజంట్ ని వెదికి పట్టుకొన్నాను. అతను రెండు అప్లికేషన్ ఫారం లు తెచ్చాడు, ఒకటి నాకూ, రెండోది మా ఇంటావిడకీ. నా అప్లికేషన్ నింపడం వరకూ బాగానే ఉంది. మా ఇంటావిడ దగ్గరకు వచ్చేసరికి సమస్య వచ్చేసింది. తన డేట్ ఆఫ్ బర్త్ కోసం తన ఎస్.ఎస్.ఎల్.సీ బుక్ ఇచ్చాము. దానిలో ఆవిడ ఇంటి పేరు” పరిమి” అనే ఉంది. మా పెళ్ళైనరోజుల్లో ఈ మారేజ్ రిజిస్ట్రేషన్లూ అవీ ఉండేవి కాదు ( 1972 లో). మా ఫాక్టరీ రికార్డ్ లలో పర్వాలేదు ( భమిడిపాటి అనే ఉంది ). ఈ ఏజంట్ మహాశయుడు ఏదైనా డాక్యుమెంటరీ ప్రూఫ్ కావాలంటాడు, మాకు పెళ్ళైనట్లుగా. 33 ఏళ్ళ తరువాత వీడేమిటీ మాశీలాలు శంకిస్తాడూ అనుకొని మాదగ్గరేంలేవు ఫో అన్నాను. ( మా అబ్బాయి కూడా అప్పుడప్పుడు మమ్మల్ని వేళాకోళం చేస్తూంటాడు, ” ఐ యాం బోర్న్ ఔట్ ఆఫ్ వెడ్లాక్ ” అని). ఏమైతేనేం , ఓ అఫిడవిట్ తయారు చేయించి మాచేత సంతకాలు పెట్టించి ఎలాగైతేనే మా వివాహం 33 సంవత్సరాల తరువాత  శాస్త్రబధ్ధం చేయించాడు.  ఈ డాక్యుమెంట్లూ, ఓ నాలుగు ఫోటోలు తిసికొని పాస్పోర్ట్ ఆఫీస్ లో ఇచ్చి ఓ రసీదు తెచ్చాడండి. 15 రోజులలో మా ఇంటికి మా పాస్పోర్ట్లు  వచ్చేస్తాయన్నాడు.. ఓ వారం రోజులకి, ఓ పోలీస్ అతను వచ్చి, మా ఎంట్రీలన్నీ వెరిఫై చేసికొని ( ఓ వంద రూపాయలు దక్షిణ తీసికొని, అదీ మా అబ్బాయి చూడకుండా ఇచ్చేను ), వెళ్ళాడు.

                                                          

      ఓ నెల అయిన తరువాత పాస్పోర్ట్ ఆఫిస్ కెళ్ళి అడిగితే ఇంకా పోలీస్ వెరిఫికేషన్ రిపోర్ట్ ( పీ.వీ.ఆర్) రాలేదన్నారు. ఇలా ఇంకో నాలుగు నెలలైయ్యింది.ఎప్పుడడిగినా ఇదే సమాధానం. ఇంక ఆరోజు వదిలిపెట్టకోడదని క్యూ లో ఓ 4 గంటలు నిరీక్షించి, పాస్పోర్ట్ ఆఫీసర్ ని అడిగాను. సంగతి ఏమయ్యా అంటే నా రెసిడెన్షీయల్ వెరిఫికేషన్ 11 నెలలకి మాత్రమే ఇచ్చారుట ( వీళ్ళకేమో 12 నెలల కి కావాలి). కారణం ఏమిటంటే, మా స్వంత ఫ్లాట్ కి వచ్చి పూర్తిగా ఏడాది అవలేదు.అంతకు ముందర ఫాక్టరీ క్వార్టర్స్ లో ఉండేవాళ్ళం. ఇదికాదు పద్ధతీ అని పూణే పోలీస్ కమిష్నర్ ఆఫీస్ కి వెళ్ళాను. మీరు అయితే ఇంకో రెండు ఫొటోలు ఇవ్వండి, మళ్ళీ చెక్ చేస్తాము అన్నారు. నాదగ్గరున్న ఫొటోలు పెట్టి మళ్ళీ ఇచ్చాను. నా దగ్గరున్న ఫొటోలు అన్నీ వీళ్ళ పరం అయిపోయాయి.

ఎన్నిసార్లడిగినా పీ.వీ.ఆర్ రాలేదనే సమాధానం. నేను పోలీస్ కమీషనర్ ఆఫీస్ కెళ్ళడం, వాళ్ళు పంపించేశామనడమూ. వ్యవహారం ఎక్కడిదాకా వచ్చిందంటే, నేను పోలీస్ ఆఫీస్ కి వెళ్ళగానే వాళ్ళందరూ నన్ను గుర్తు పట్టేసి హలో అనడం మొదలెట్టారు, ( నా ఉద్దేశ్యం వీ.ఐ.పీ లని గానీ, నేరస్థులని గానీ వీళ్ళు సుళువుగా గుర్తు పట్టేస్తుంటారు , నేను ఏ క్యాటిగరీ లోకి వస్తానో ఆ భగవంతుడి కే తెలియాలి )

                                                            ఈ మధ్య లో గవర్నమెంట్ లో తెలిసున్న ఏజన్సీ లకన్నింటికీ నా కంప్లైంట్ పంపించాను ( ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా తో సహా ). ఏమైతేనే   275 రోజుల తరువాత  ( అంటే పూర్తి  9 నెలల జెస్టేషన్ పీరియడ్ పూర్తీయన తరువాత ) మా పాస్పోర్ట్లు చేతికి వచ్చాయండి!!

                                                            మనవాళ్ళు మాత్రం పెద్ద పెద్ద ప్రకటనలు ఇచ్చేస్తూంటారు — 3 వారాలలో మీ పాస్పోర్ట్ అంటూ.

%d bloggers like this: