బాతాఖాని ఖబుర్లు —16

                                                                   1965 లో జరిగిన భారత్–పాకిస్తాన్ యుధ్ధం టైము లో మా ఫాక్టరీ లో చాలా హడావిడి గా ఉండేది. ఊరంతా బ్లాక్ ఔట్ లూ,  ప్రతీ రెండేసి గంటలకీ  ఎయిర్ రైడ్ సైరన్లూ ఎంత భయం వేసేదో!!  రాత్రిళ్ళు  పూనా సిటీ లో  ఎక్కడా లైట్లు ఉండేవి కాదు. ఆ చీకట్లోనే ఎలాగోలాగ భోజనం చేసేయడం, రూమ్ కి చేరుకోవడం. లాల్ బహ్దూర్ శాస్త్రి గారి పిలుపు మేరకు వారం లో ఒక రోజు ( సోమ వారం ) రైస్ లెస్స్ డే ఉండేది. ఆ రోజు ఏదో జావ లాంటిది ఇచ్చేవారు. ఇలా 15 రోజులు అయిన తరువాత యుధ్ధం ఆగింది. ఆ తరువాత తాష్కెంట్ లో శ్రీ లాల్ బహదూర్ చనిపోవడం అందరినీ విచారం లో ముంచేసింది.

                                                                   1966 లో నాకు మొదటి ప్రమోషన్ వచ్చిందండీ. ఈ లోపులో నేను ఒక కేరం బోర్డ్ ఒకటి కొన్నాను, అలాగే  ఒక

రికార్డ్ ప్లేయర్ కూడా ( ఎచ్.ఎం.వీ  ది ). ఇంక ప్రతీ నెలా రెండేసి ఎల్.పీ లు, ఈ.పీ లు రెండు చొప్పున, నారికార్డ్ సేకరణ ప్రారంభం అయింది. నెలలో ఒక రోజు ఎమ్.జి.రోడ్ లో ఉన్న  అపోలోమ్యుజిక్ సెంటర్ కి వెళ్ళడమూ, ఆనాలుగూ కొనుక్కోవడం. ఓ రెండు నెలలైన తరువాత ఆ కొట్టు వాడు నాకు ” క్రెడిట్ ” కూడా ఇవ్వడం మొదలెట్టాడు. ఇంక నా స్పీడ్ కూడా పెరిగిపోయింది, తెలుగు, హిందీ పాటల రికార్డ్ లు చాలా కొనెశాను.

                                                                  అదే సంవత్సరం లో ఒక రోజు ఫాక్టరీ నుండి వచ్చేసరికి, నాకు గొంతుక లో విపరీతమైన నొప్పి ప్రారంభం అయ్యింది. ఆ నొప్పి ఎక్కడినుంచో తెలియక, దగ్గరలో ఉన్న ఒక ‘డెంటిస్ట్ ” దగ్గరకు వెళ్ళాను,ఆయన ఏదో యాంటీ బైయాటిక్ ఇచ్చారు. దానితో సాయంత్రానికి నా నోరు పూర్తిగా మూత పడిపోయింది. ఆరోజు సాయంత్రం మా ఫ్రెండ్ శ్రీ బాలరంగయ్య గారు ఏ.ఎఫ్.ఎమ్.సీ. నుండి నన్ను ఊరికే చూద్దామని వచ్చి,నా పరిస్ఠితి చూసి వెంటనే వాళ్ళ ప్రొఫెసర్ గారి దగ్గరకు తిసికెళ్ళారు. ఆయన చెక్ చేసి వెంటనే నన్ను కమాండ్ హాస్పిటల్  ఎమర్జెన్సీ వార్డ్ లో చేర్చారు. ఎలాగోలాగ డాక్టర్లు అందరూ కలిసి నన్ను కాపాడేరు. ఆ రోజున ఆయనే లేకపోతే ఇలా మీతో నాజ్ఞాపకాలు పంచుకొనే అదృష్టం ఉండేది కాదు. అక్కడ ఓ నెల రోజులు ఉంచారు. ఇదే శ్రీ బాలరంగయ్య గారి సహాయంతో 9 సంవత్సరాల తరువాత  నా భార్య చెల్లెలికి పునర్జన్మ వచ్చింది.

                                                                 హాస్పిటల్ నుంచి డిస్చార్జ్ అయిన తరువాత మళ్ళీ మా చిన్నన్నయ్య గారి దగ్గరకు హైదరాబాద్ వెళ్ళాను. అక్కడ ఉండగా  ఆల్ ఇండియా రేడియో లో ఒకసారి శ్రిమతి ఎమ్.ఎస్.సుబ్బలక్ష్మి గారి కచేరీ ( ఐక్యరాజ్యసమితి లో చేసినది) ప్రసారం అయ్యింది. అది రికార్డ్ చేయమని మా వదిన గారు  చెప్పారు. ఆ రోజు ఎమ్.ఎస్. కచేరీ విన్న తరువాత నాకు కర్నాటక సంగీతం మీద విపరీతమైన అభిమానం వచ్చేసింది.. పూనా వెళ్ళగానే మా రికార్డ్ కొట్లో ఉన్న కర్నాటక సంగీతం ఎల్.పీ లు ఎన్ని కొన్నానో లెఖ్ఖ లేదు.ఎమ్.ఎస్, చెంబై, చిట్టిబాబు, నామగిరిపెట్టై, షేక్ చిన్నమౌలా, లాల్గుడి, బాలమురళీ, అడక్కండి– నా జీతం లో సగం పైగా వీటికే ఐపోయేది.. ఇది ఇలా ఉండగా  ఎప్పుడో అప్లై చేసిన  బర్షేన్ గాస్ కూడా వచ్చేసింది. దాంతో పాటు ఓ కుక్కర్ కూడా కొనేసికొని, ఓ మిక్సీ కూడా కొనుక్కొన్నాను. అంటే 1966 నాటికి నాకు ఇంట్లో కావల్సిన ముఖ్యావసరాలు కొనుక్కోవడం అయింది,

                                                                 1967 లో ఓ తెల్లవారుఝామున నా రూమ్ లో పడుక్కొన్నాను, సడెన్ గా రూమ్ అంతా ఊగడం మొదలెట్టింది, రూమ్ పైన ఉన్న కారగేటెడ్ షీట్స్ దబ దబా మని చప్పుడూ, మంచం మీద నుంచి కింద పడ్డాను. ఉలిక్కిపడి లేచి చూస్తే ఆ వాడ లో అందరూ పిల్లా, పాపలతో ఇళ్ళ బైటకు వచ్చేశారు.  కొయినా నగర్ లో భూకంపం వచ్చిందిట.ఆ రోజు నేను  అనుభవించిన క్షణాలు జీవితం లో ఎన్నడూ మరువలేనివి.. అప్పటి దాకా రాస్తా పేట లో ఉండెవాడిని. పైన ఒక రూమ్మూ, కింద ఒకటీ. ఈ భూకంపం వచ్చేముందర మా అమ్మ గారు పూనా వచ్చేరు. ఆవిడకి భాష రాదు, వినిపించదూ, ఎలా మేనేజ్ చేసేవారో తెలియదు కానీ ,మార్కెట్కెళ్ళి కూరలూ అన్నీ తెచ్చి వంట చేసి పెట్టేవారు. ఎమేజింగ్!!

                                                               ఈ రూమ్ కండిషన్ చూసి భయ పడి ( ఎప్పుడు కూలుతుందో తెలియదు) , విశ్రాంత వాడీ దగ్గర కలాస్ అనే చోటకి మారిపోయాను. అక్కడ కూడా రెండు రూమ్ములే. బై ద వే ఆ రాస్తాపేట లో నేను ఉన్న ఇల్లు ఇప్పడికీ సలక్షణంగా ఉంది!!  నా రూమ్ అయితే అందరికీ ఓ క్లబ్ లాగ తయారైపోయింది. రాత్రిళ్ళు 2 గంటలదాకా కేరం బోర్డ్ , ఆడడం, అక్కడ ఉన్న తెలుగు వాళ్ళందరూ మా ఇంట్లోనే. వాళ్ళకీ బాగా కాలక్షేపం అయ్యేది. నేను కుక్కర్ లో అన్నం ఒకటీ పెట్టుకొన్నా, మిగిలినవి ఎవరో ఒకరు తెచ్చేవారు. ఓ పది కుటుంబాలుండేవి ఆరోజుల్లో. తెలుగు పుస్తకాలు అన్నీ తెప్పించేవాడిని. అందువల్ల మారూమ్ కి ఎవరొచ్చినా కాలక్షేపానికి లోటుండేది కాదు.. ఇంకో కారణం ఏమిటంటే, నాకున్న “ప్రోబ్లం” వాళ్ళకి ఏమీ అనిపించేది కాదు. వాళ్ళ పిల్లల్ని నా దగ్గర వదలడానికి ఏమీ సంకోచించేవారు కాదు..  బహుశా ఇదే నాకు కావల్సినంత మనో బలాన్నిచ్చిందేమో. నేనూ మిగిలినవాళ్ళలాగ ఉండడానికి ప్రయత్నించేవాడిని. అస్సలు నాకేదో ఉందని అనుకొనేవారు కాదు.. నేను ఇదే పరిస్థితుల్లో మన ప్రాంతం లో ఉండి ఉంటే వెరేగా ఉండేది.  నావంటివాళ్ళ మనస్థితి తెలియాలంటే సుధా మూర్తి గారు వ్రాసిన ” మహాస్వేత ” చదవండి.

                                                            ఇదంతా ఇలా ఉండగా పూనా లో జరిగే ప్రతీ సంగీత కచేరీ కీ వెళ్ళేవాడిని. నాతోపాటు నాదగ్గర ఉన్న రికార్డ్ లు తీసికెళ్ళడమూ, వారి దగ్గర ఆటోగ్రాఫ్ తీసికోవడమూ. ఇలాగే ఎమ్.ఎస్,చెంబై, చిట్టిబాబు, సెమ్మంగుడి,ఎమ్.ఎల్.వీ,చిన్నమౌలా, నామగిరిపెట్టై, బాలమురళీ ల సంతకాలు తీసికొన్నాను. ఇవే కాకుండా మా అన్నయ్య గారు నేర్పించింది–పెద్ద పెద్ద వాళ్ళకి లెటర్స్ వ్రాయడం,వారి దగ్గరనుంచి రిప్లై రావడం, పూనా లో ఆరోజుల్లో జరిగిన క్రికెట్ మేచెస్ అన్నీ చూసేవాడిని. ఆటో గ్రాఫ్ లు మరచిపోలేదు, అలాగే మన ‘ గోల్డెన్ ఇరా ” లో ఆడిన హాకీ ప్లేయర్స్ చాలామంది దగ్గర ఆటొగ్రాఫ్ లు తీసికొన్నాను. బి.బి.సి కామెంటేటర్స్  బ్రియాన్ జాన్స్టన్, జాన్ ఆర్లాట్, ట్రెవర్ బైలీ, మేక్స్ రాబర్ట్సన్, అలాన్ నాట్, ఆస్ట్రేలియన్ కామెంటేటర్ అలాన్ మెక్గిల్వ్రె .అవి అన్నీ ఇప్పడికీ ఉంచాను. మా అబ్బాయి అవి చూసి చాలా త్రిల్ అయిపోతూంటాడు.

                                                           నా రికార్డ్ లూ, ప్లేయరూ హైదరాబాద్ వచ్చినప్పుడల్లా నాతోటి తీసికెళ్ళేవాడిని. ఒకసారి రవీంద్ర భారతి లో శ్రీ చిట్టిబాబు గారి కచేరీ అయిన తరువాత సంతకానికి వెళ్తే ఆయనన్నారూ ” నిన్నెక్కడో చూసినట్లుందీ ” అని అంతకు ముందు ఒకసారి ఆయనను పూనాలో కలుసుకొన్నాను. అంటే నేనన్నానూ, మీరు రిలీజ్ చేసిన ప్రతీ రికార్డూ కొంటాను నేను, వీలున్నప్పుడు మీచేత సంతకం చేయించుకొంటానూ. ఇలాగే ఎమ్.ఎస్ అమ్మ గారి దగ్గరా..

                                                           ఇదంతా ఇలా ఉండగా నన్ను ఫాక్టరీలో టెక్నికల్ లైబ్రరీ కి ట్రాన్స్ఫర్ చేశారు. అక్కడ  జనరల్ బుక్స్ చాలా తక్కువ ఉండెవి. మా బాస్ నన్ను ప్రతీ వారం నన్ను బయటకు పంపేవారు. నెను కాంప్ లో ఉన్న మేనీస్ , మోడర్న్ బుక్ స్టాల్ కి వెళ్ళడము, అక్కడ పుస్తకాలు తెచ్చి మా జనరల్ మేనేజర్ గారికి పుట్ అప్ చేయడమూ, ఆయన దానిని అప్రూవ్ చేయడమూ. ఆయన పెరు శ్రీ గౌరీ శంకర్. నా జీవితం లో ఆయన చేతివ్రాత లాంటిది కానీ, ఆయన వాడే ఇంగ్లీష్ కానీ ఎక్కడా చూడలేదు. సింప్లీ సుపర్బ్!!. ఒకసారి నేను ఇలా ప్రతీవారం బయటకు వెళ్ళడం చూశారు.నేనే లైబ్రరియన్ అని తెలియదు ఆయనకి. ఆ తరువాత నన్ను వారానికి రెండుసార్లు వెళ్ళమనేవారు!!  వెళ్ళినప్పుడల్లా కయానీ లో కేక్ లూ, బుధానీ లో  వేపర్సూ తిసికొనిరావడమూ, సెక్షన్ లో పార్టీ చేసికోవడమూ.

బాతాఖానీ –తెరవెనుక ( లక్ష్మిఫణి ) ఖబుర్లు

                                                                    

       క్రిందటిసారి ఖబుర్లలో చెప్పాను కదండీ, మా ఇంటావిడ తన ” వెయిట్ రెడ్యూసింగ్ అభియాన్” లో నన్ను చాలా తిప్పలు పెట్టేస్తోంది. ఇంటినిండా క్యారెట్లూ, బీట్రూట్లూ, మొలకెత్తిన పెసలూ, ఇవేకాకుండా ఈ మధ్యన “ఓ ట్స్ ” ఒకటి.  వాట్లతో ఉప్మా చేస్తుంది, ఇదేమీటంటే ” ఆరోగ్యానికి చాలా మంచిది ” అని ఓ డైలాగ్గూ . ఏదొ ఆవకాయ రోజులు కదా అని ఏమైనా మనసు మార్చుకొని మామిడి కాయలు తెమ్మంటుందేమోనని రోజూ, ” నేను బజారు కి వెళ్తున్నానూ ఏమనా కావాలా ” అంటే , ” క్యారెట్ ఒక్కటే ఉంది,దాంతో పాటు కీర దోసకాయ తీసుకురావడం మర్చిపోకండి” అంటుందే కానీ మామిడి కాయల సంగతి ఎత్తదే . ఈ మధ్యన మా మరదలు కొత్తావకాయ, మాగాయ ఓ బాటిల్ లో పెట్టి ” పోనీ బావగారు వేసికొంటారు ” అంటూ, మాకిచ్చింది. ఇంక రోజూ, పొద్దున్నా సాయంత్రం ఈ రెండింటితోటీ లాగించేస్తున్నాను. వాళ్ళు వచ్చి  ” మా ఊరగాయలు ఎలా ఉన్నాయి ” అని అడగ్గానే ” బ్రహ్మాండంగా ఉన్నాయి ” అనేశాను. ఇలా అనేటప్పడికి మా ఇంటావిడలో  రావల్సిన మార్పు వచ్చేసింది, ఈ రెండు బాటిల్స్ లోదీ అవగానే ఈయన ఎవరింటికో వెళ్ళేసి తన బాధలూ వెళ్ళబోసి మళ్ళీ ఓ రెండు బాటిల్స్ తెచ్చేసుకొంటాడూ అవటా అనుకొని , ఈసారి బయటకు వెళ్ళినప్పుడు ఓ 20 కాయలు తెండి, ఉప్పులోవేస్తాను, అది మాగాయ కి, పప్పులోకి ఉపయోగిస్తుందీ అని మొత్తానికి పర్మిషన్ ఇచ్చేసిందండి.  ఆ 20 కాయలూ సైజ్ ఎలా ఉండాలో చెప్పలేదు,నేను  నా డెసిషన్ తీసికొని ఓ పాతిక కాయలు తెచ్చేశాను. అందులో ఓ 20 కాయలు తరిగి ఉప్పులోవేసింది. ఓ అయిదు కాయలు పక్కనేఉంచి, ” బజారు కెళ్ళి ఓ అర కిలో ఆవకాయ పిండి,ఒ కిలో పప్పునూనే తీసుకురండి అని ఓ వరం పారేసింది. పరిగెత్తుకొని బజారెళ్ళి ఆ రెండూ తీసికొచ్చేశాను. ఆ విధంగా మా ఇంట్లోకూడా ఓ బాటిల్ తో కొత్తావకాయ వచ్చేసింది. ఇప్పుడే చెప్తోంది ” ఆ ఉప్పులో వేసిన ముక్కలు మీకోసం కాదూ, పూణే లో మా పిల్లలికిట”. పోన్లెండి ఆవకాయైనా పెట్టింది, ఒకటి మాత్రం డిసైడ్ చేసుకొన్నాను, మాఇంటికి ఎవరైనా భోజనానికి వస్తే, ఈ ఆవకాయ మాత్రం వెయ్యనీయను ( దీన్ని  నేను ఏడాది పాటు అపురూపరంగా వేసికోవాలి ), వాళ్ళకి కర్రీపాయింట్ నుంచి తెచ్చిన పచ్చళ్ళు మాత్రమే!!

                                                                 

     ఏమిటో అనుకొంటాము గానీ ఈ  ఈతిబాధలు అన్నీ మనం చేతులారా తెచ్చుకొన్నవే. గుర్తుండేఉంటుంది స్నాతకం టైము లో కాశీ ప్రయాణం అని ఉంటుంది, అప్పుడు పెళ్ళికొడుకు పాంకోళ్ళూ, ఓ గొడుగూ అవీ పట్టుకొని కాశీ వెళ్ళిపోతానూ అంటాడు, అలా వెళ్ళిపోయినా బాగుండేది. ఇంతలో మనకి అవబోయే బావమరిది వచ్చి ” వద్దు బావా మా అక్కయ్యనిచ్చి పెళ్ళి చేస్తామూ ” అంటాడు. ఆ టైము లో మనం బుట్టలో పడిపోతాము. ఏదో బట్టలూ అవీ పెట్టి మనని కన్ఫ్యూజ్ చేసేసి ఇలా సెటిల్ అయిపోతాము. ” వుయ్ హాడ్ అవర్ చాయిస్” ఎవర్నీ ఏమీ అనడానికి లేదు.

 

                                                           

     ” ఏ నాటి నోము ఫలమో  ఏ దాన బలమో ”  అంటూ భైరవి రాగం లో త్యాగరాజ కీర్తన పాడుకొంటూ లాగించేయడమే !!

%d bloggers like this: