బాతాఖానీ ఖబుర్లు—–15

                                                            శ్రీ శాస్త్రి గారు నేను ఏ. ఎమ్.ఐ.ఈ  పరీక్ష కి వెళ్ళకపోతే ఇంటికి పంపించేస్తారేమో అని భయం వేసి ఏదో మొదలెట్టాలి కదా అని, ముందుగా  ఏదో ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్ లో చేరితే బాగుంటుందని పేపర్లలో వెదికితే బొంబాయి లో ” బ్రిటిష్ ఇన్స్టిట్యుట్ ఆఫ్ టెక్నాలజీ ” అని ఒకటి దొరికింది. దాని కి ఫీజ్ 400 రూ.లు అడిగాడు. అంత డబ్బు మన దగ్గర ఎక్కడిదీ–నా రెండు నెలల జీతం ఇలాంటి దానికి పెట్టుబడి పెట్టడం అంత బాగోలేదు. మా పెద్దన్నయ్య గారికి రాస్తే పాపం ఏదో చదువుకోవాలని బుధ్ధి పుట్టిందీ అని పంపించారు. ఆ బొంబాయి వాడికి డబ్బు కట్టగానే ప్రతీ వారం ఏవో పుస్తకాలూ, నోట్సూ పంపడం మొదలెట్టాడు. ఇదంతా చూసి మా శాస్త్రి గారు ” వీడు నేను చెప్పినట్లుగా చదువు రంధి లో పడ్డాడూ ” అనుకొని వాళ్ళింటికి ప్రతీ వారం రావఖర్లేదన్నారు.అమ్మయ్య ఓ గొడవ తప్పిందిరా బాబూ అనుకొన్నాను. ఇంక ” ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ ” లో రిజిస్టర్ చేసుకోవాలన్నారు.దానికి మా ఫాక్టరీ లో ఉన్న ఒక మేనేజర్ గారి సంతకం కావల్సి వచ్చింది. ఆ ఫార్మ్ లో నా అకడమిక్ రికార్డ్ రాయాలి. అక్కడ  నా మార్కులు ( బి.ఎస్.సీ ) లోవి రాయవలసివచ్చింది నేను పెద్ద గొప్పగా–99 . 145, 160 రాసేశాను. ఆయన అది చూసి ” ఆహా నాదెంత అదృష్టం, లెఖలలో 99 వచ్చినవాడిని చూశాను” అనుకొని నన్ను లోపలికి పిలిచారు. ” కంగ్రాట్యులేషన్స్ నీలాంటి వాడు నా సెక్షన్ లో పనిచేస్తున్నాడంటే మాకు ఎంత గౌరవమూ…” ఓరి బాబోయ్ ఇదెక్కడ గొడవరా బాబూ అనుకొని మెల్లిగా చెప్పాను…”సార్ అవి 300 కి ” అని.ఇంక చూడాలి ఆయన రియాక్షన్, ” ఇలా చీట్ చేయకూడదు, కరెక్ట్ గా రాయాలి ” అని చివాట్లు పెట్టారు.  ఈ హడావిడి లో  మా శాస్త్రి గారికి ఢిల్లీ ట్రాన్స్ఫర్ అయింది. ఇంక నన్ను కంట్రోల్ చేసేవాళ్ళు ఎవరూ లేరు !! పరిక్ష కి వెళ్ళినా ఒకటే లేకపోయినా ఒకటే. అలా నాదగ్గర ఏ.ఎమ్.ఐ.ఈ కి సబంధించిన పుస్తకాలూ, నోట్సులూ మిగిలిపోయాయి.

                                                     ఇంక మా ఫ్రెండ్స్ తో  సినిమాలూ, తిరగడాలూ. బలే మజాగా ఉండేది. ఈ మధ్య లో ” బ్రిటిష్ కౌన్సిల్ ” లో మెంబర్షిప్ పుచ్చుకొన్నాను. ఏడాదికి  20 రూపాయలు.  దాంట్లో మెంబర్ అవడం ఓ పెద్ద అదృష్టం గా భావించేవారు ఆ రోజుల్లో. అవసరమైన చదువులు తప్పించి మిగిలినవాటిలో చాలా ఇంటరెస్ట్ ఉండేది. నేను మా ఫాక్టరీ లో పనిచేసే సెక్షన్ అన్నింట్లోకీ ప్రమాదకరమైనది. అందులో పనిచేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసికోవాలి. అక్కడ పనిచేసిన

3 సంవత్సరాలలోనూ జీవితం లో కావల్సిన చాలా జాగ్రత్తలు నేర్చుకొన్నాను. ప్రముఖంగా ” సేఫ్టీ ” గురించి. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా మనమే కాకుండా పక్కవాడి ప్రాణం కూదా పోతుంది. అలాంటి దురదృష్టకరమైన ఓ రోజు మాతో పనిచేసే సుబ్బారావు అనే ఒక సీనియర్ , ఎక్స్ప్లోజన్ లో చనిపోయాడు.. అది చూసేటప్పడికి నాకైతే చాలా భయం వేసేసింది. కానీ నాకు నేనే ధైర్యం చెప్పుకొని ‘ జై భజ్రంగభళీ ” అనుకొంటూ ముందుకు పోయాను.

                                                    జీవితం లో ( అంటే ఉద్యోగరీత్యా ) కావల్సినవి చాలా నేర్చుకొన్నాను మా పై వాళ్ళ ద్వారా– మా ఆఫీసర్ ఒకాయన ఉండేవారు–ఆయన చెప్పేవారూ, నువ్వు ఏదైనా డాక్యుమెంట్ మీద సంతకం పెట్టె ముందర నీ కిందవాడు పెట్టాడాలేదా చూడు, అలాగే పైవాడుకూడా. దీని వలన ఉపయోగం ఏమిటంటే, ఆ తరువాత  ఏదైనా ప్రోబ్లెం వస్తే , నేరం అంతా నీ ఒక్కడిమీదకూ రాదు–అనేవారు. ఈ నీతి సూత్రం నా 42 ఏళ్ళూ పాటించాను. “ఆల్వేజ్ సక్సెస్ ” అయ్యాను. అంటే అస్తమానూ గొడవలయ్యేవని కాదు, మన జాగ్రత్త లో మనం ఉండాలని నా ఉద్దేస్యం.

                                                  మాకు డ్యూటి పొద్దున్న 7.30 నుంచి సాయంత్రం 6.00 దాకా ఉండేది. లంచ్ 12.30 –1.30 . లంచ్ ఇంటర్వెల్ లో పనిచేశే బిల్డింగ్ లోనె టేబిల్ మీద తల పెట్టుకొని కొద్దిగా కన్ను మూయడం. 1.30 కి మా బాస్ వచ్చిలెపేవారు. ఒకసారి రెండు గంటలైపోయంది, నేను ఎవరో లేపుతున్నారని  కళ్ళు తెరిచేడప్పటికి, మా బాస్ ఎదురుగా ఉన్నారు. ఇంకేముందీ భోరుమని ఏడవడం మొదలెట్టేసరికి ఆయన ఖంగారు పడిపోయారు. అలాగే ఎప్పుడైనా 12.30 కి డబ్బా రాకపోతే ఆకలేసి ఏడ్చేసేవాడిని. మా ఫ్రెండ్స్ అందరికీ ఇప్పడికీ గుర్తు !! ఎంతైనా 18 ఏళ్ళవాడినేకదా, ఆ పసితనం పోలేదు.పై చదువులకైనా వెళ్ళాలి, లేక ఊళ్ళో బలాదూర్ గా నైనా తిరుగుతూండాలి  ఇంతేకాని ఊరు గాని ఊళ్ళో ఉద్యోగాలేమిటీ ?

                                                 బొంబాయి లో నాకు మేనల్లుడు వరసైన ( అంటే మా కజిన్ అక్కయ్య గారి అబ్బాయి )  శ్రీ రామచంద్రుడు గారుండేవారు. ఒకసారి ఆయనకు ఒంట్లో అస్వస్థత చేసింది. ఆయన ఫ్రెండ్స్ లో ఒకరికి తెలుసును నేను ఇక్కడ ఉన్నానని ( ఏదో పిల్లనిచ్చే మామ అనుకొన్నారు !!). నాకు అర్జెంట్ గా రమ్మని టెలిగ్రాం ఇచ్చారు. ”  రామచంద్రుడూ సిక్ స్టార్ట్ ఇమ్మీడియెట్లీ—- ఆకాష్ వాణి “. ఈ రేడియో వాళ్ళు ఎందుకు ఇచ్చారా  అనుకొంటూ బొంబాయి జె.జె హాస్పిటల్ కి వెళ్ళాను, అక్కడ తెలిసిందేమిటంటే ఈ టెలిగ్రాం ఇచ్చినాయన పేరు ” లక్ష్మణ స్వామి “, మన పోస్టల్ వాళ్ళు ” ఆకాశవాణీ” చేశారు.. నన్ను చూసేసరికి

వాళ్ళందరూ ఆశ్చర్యపడి, ” మేం మీగురించి ఏదో పెద్దవాళ్ళై ఉంటారనుకొన్నాము, ఇప్పుడు మీకు ఏమైనా వస్తే మిమ్మల్ని కూడా హాస్పిటల్ లో చేర్పించాలి, పూనా తిరిగి వెళ్ళిపోండి, ఈయన సంగతి మేమే ఏదో చూసుకొంటాము” అన్నారు. అప్పుడు పూనా లో హిందూ- ముస్లిమ్ రైట్స్ జరిగాయి. ఆ సందర్భం లో పూనా లో చాలా ఉద్రిక్తంగా ఉండి పోలీసులు  టియర్ గాస్ ప్రయోగం అదీ చేశారు. అప్పుడు అది ఎలా ఉంటుందో తెలిసింది.

                                                 పైన చెప్పిన ఇన్సిడెంట్  1965 లో జరిగింది. ఆ ముందర 1964 లో మే నెలలో ఒకరోజు పూనా కాంప్ లో “క్యాపిటల్” సినిమాలో

” కాష్మీర్ కీ కలీ ” సినిమా మ్యాట్నీ కి వెళ్ళాను సినిమా మధ్యలో స్లైడ్ వేసి అందరినీ బయటకు వచ్చేయమన్నారు. కారణమేమిటా అని కనుక్కొంటే తెలిసింది.” శ్రీ జవహర్లాల్ నెహ్రూ ఇక లేరూ “. ఆ రోజున చాలా బాధ వేసింది. ఎంత చెప్పినా ఆరోజుల్లో ఆయనేకదా మన ప్రియతమ ప్రధాన మంత్రి!! పూనా అంతా బంధ్. అన్ని హోటళ్ళూ, బస్సులూ, ఆటోలూ. ఎక్కడచూసినా అందరి ముఖాలలోనూ విచారమే. మొత్తం పూనా సిటీ అంతటికీ ఒక్క  రైల్వే స్టేషన్ క్యాంటీన్ మాత్రమే తెరిచారు.

భోజనానికి క్యూ లో 3 గంటలు పట్టింది. 

                                               మా తెలుగు ఫ్రెండ్ డెక్కన్ జింఖానా లో లాడ్జి వెళ్ళగానే మా రూమ్ లోకి ఒక కేరళ ఆయన, కన్నడం ఆయనా ( ఈయనకి తెలుగు బాగా వచ్చు) మా రూమ్ లో చేరారు. అప్పుడు చాలా బాగుండేది. ప్రతీ రోజూ సాయంత్రం స్టేషన్ దగ్గర బయల్దేరి, ఇంకంటాక్స్ ఆఫీస్ మీదుగా, వెస్టెండ్ థియేటర్, మహాత్మాగాంధీ రోడ్,అక్కడినుంచి క్వార్టర్గేట్ నుంచి సింగ్ హొటెల్ కి వెళ్ళేవాళ్ళం. ఎన్నెన్ని ఖబుర్లో, వారి దగ్గర చాలా నేర్చుకొన్నాను, అవి జీవితం లో చాలా ఉపయోగపడ్డాయి. ఈ మధ్యలో నా ” ప్రోబ్లం ” ( అంటే వైట్ పాచెస్ ) ఇంకా పెరుగుతూ వచ్చింది. అయినా సరే నాస్నేహితులు దానిగురించి పట్టించుకొనేవారు కాదు.

అప్పుడు తెలిసింది మనవారనుకొన్నా వారికీ, స్నేహితులకీ తేడా ఏమిటో.. నేను ఈ కారణాల వల్ల 1963 నుండి 1972 జనవరి దాకా అమలాపురం వెళ్ళి మొహం చూపించలేకపోయాను. అందువల్ల ప్రతీ ఏడాదీ హైదరాబాద్ లో ఉన్న మా చిన్నన్నయ్య గారింటికే వెళ్ళేవాడిని, అక్కడ మా వదిన గారూ, వాళ్ళ అమ్మాయి అరుణ

ల తో బాగా కాలక్క్షేపం అయ్యేది

%d bloggers like this: