బాతాఖానీ ఖబుర్లు — 11


                                                    

    పూనా లో ఇంటర్వ్యూ కి వెళ్ళడానికి నన్ను అన్నిరకాల ముస్తాబులూ చేశారు. అమలాపురం లో ఆరోజుల్లో పెద్ద పెద్ద షాప్ లు ఉండెవి కాదు. అందువలన ఒక రోజు ముందుగా రాజమండ్రి వచ్చి , కొత్త బూట్లూ, కొత్త పాంటు, కొత్త చొక్కా కొనుక్కొని హైదరాబాద్ వెళ్ళామండీ. ఆ రోజుల్లో బొంబాయి వెళ్ళడానికి ఒక్క కంపార్ట్మెంట్ మాత్రం ఉండేది. దాన్ని ” వాడీ ” లో ఇంకో ట్రైన్ కి కలిపేవారు. ఎలాగోలాగ అది ఎక్కి మర్నాడు పొద్దున్న పూనా చేరాము. మా పెదనాన్న గారి అబ్బాయి అక్కడ   ఏ.ఎఫ్.ఎమ్.సీ. లో మొదటి సంవత్సరం లో ఉండేవాడు. మేం ఇద్దరం క్లాస్ మేట్లమే– బాగా చదువుకుంటే వాడిలాగ ఉండే వాడి నన్న మాట, మన కి ఆ యోగం లేదు ఏమైతేనే తను స్టేషన్ కి వచ్చి వాళ్ళ హాస్టల్ కి తీసికెళ్ళాడు. ఓ యమ్మో ఆ  మిలిటరీ డిసిప్లీన్ అవీ చూసిన తరువాత పోన్లే నేను ఇలాంటి కష్టాలు పడఖర్లేదు అని సంతోషించాను.

                                                    

    ఆ రోజు సాయంత్రం మేము ముగ్గురూ కలసి ( మర్చిపోయాను నా తో మా నాన్న గారు కూడా వచ్చేరండోయ్, పిల్లాడు ఒక్కడు వెళ్తున్నాడూ అని మా అమ్మమ్మ గారు పంపించేరు !!). ఆ పెద్దాయన శ్రీ శస్త్రి  గారి ఇంటికి వెళ్ళామండీ. ” అరే ఈ మాత్రం దానికి మీరు పెద్దవారు ఇంత దూరం రావాలా, అబ్బాయిని పంపితే సరిపోను గా” అన్నారు ఓ హో మనకి ఉద్యోగం వచ్చేసినట్లే ఉంది అనుకొన్నాను. ఓ గంట సేపు అదీ ఇదీ ఖబుర్లు చెప్పుకొన్న తరువాత, ఇంక నా మీదకు దృష్టి పెట్టారు. ” బాగా ప్రిపేర్ అయ్యావా” అన్నారు. ఏదో ” హై ఎక్స్ప్లోజివ్స్ ఫాక్టరీ”లో ఇంటర్వ్యూ కదా అని గొప్పగా ఆల్ఫ్రెడ్ నోబల్, అవీ ఇవీ అన్నీ బట్టి పట్టేసి , ” ఆ బాగానే చదివానండీ” అన్నాను. ఆయన వాలెన్సీ, మాలిక్యులర్ వైట్,  అలాంటివి అడగడం మొదలెట్టారు. డిగ్రీ చేతిలోకి రాగానే వాటి గురించి మరచి పోయాను ( అలాంటివి గుర్తు పెట్టుకోవడం నామోషీ అనిపించి ). పరీక్ష పాస్ అయి ఇంకా రెండు నెలలు కాలేదు. నాకేమైనా జ్ఞాపకం ఉంటెకదా ఆయన ప్రశ్నల కి సమాధానం చెప్పడానికీ. నేను మిగిలనవి అన్నీ ప్రిపేర్ అయ్యానండీ అన్నాను, పెద్ద పోజు పెట్టి.  వాటి గురించి నేర్చుకోవడానికి ఉద్యోగం లో చేరిన తరువాత ఇక్కడ ట్రైనింగ్ ఇస్తారూ, నువ్వు ముందర ఇప్పుడు నేను అడిగిన వన్నీ గుర్తు పెట్టుకొని రేపు ఇంటర్వ్యూ లో సమాధానాలు ఇయ్యి. అన్నారు.

                                                 

     అక్కడ నుంచి హాస్టల్ కి తిరిగి వచ్చిన తరువాత ఇంక చూడండీ నా అవస్థా!! కాలేజీ లో ఫస్ట్ యియర్ లో ఉన్నారు కదా, అక్కడ మా కజిన్ గారి ఫ్రెండ్స్ అందరూ అన్ని రకాల కెమిస్ట్రీ  పుస్తకాలూ తీసి నన్ను  తోమేశారండి ఆ రాత్రంతా. వాళ్ళకెంత సంబరమో. ఆ కాలేజీ కి అదే మొదటి బాచ్, రాగ్గింగ్ గురించి వినడమే కానీ చేయడానికి ఎవరూ  లేరు, నేనో బక్రా గాడిని దొరికాను వాళ్ళకి. ఎలాగో రాత్రి మూడింటి దాకా నాకు<b. " సర్వ శిక్షా అభియాన్" స్కీమ్ లో లాగ నన్ను తయారు చేశారు. ఈ హాస్టల్ నుండి నేను ఇంటర్వ్యూ కి వెళ్ళే ప్లేస్ 10 కిలోమీటర్లు ఉంది. ఎలాగో ఆ ముందర రోజు వెళ్ళిన రూట్ గుర్తు పెట్టుకొని బయల్దేరానండీ ( కొత్త పాంటూ, షర్టూ, కొత్త బూట్లూ –చప్పుడు చేశేవి  ). బస్సు దిగిన తరువాత ఓ కిలో మీటర్ నడవాలండి. కొత్త బూట్లు కదా కరవడం మొదలెట్టాయి. ఎలాగో లాగ అవస్థ పడి ఆ చోటకి చేరానండి.  సెక్యూరిటీ  వాళ్ళు గేట్ దగ్గర ఆపేశారు. అది రక్షణ శాఖ లో ఉన్న ఒక ఆర్డినెన్స్ ఫాక్టరీ, చేతిలో గన్స్ తో సెక్యూరిటీ అదీనూ. సమాధానం చెప్పి నా ఇంటర్వ్యూ లెటర్ చూపిస్తే లోపలికి వదిలారండి. నేనూ, నా వేషం, కుంటుకుంటూ ( బూట్లు కరుస్తున్నాయి గా ) ఓ రూమ్ లో కూర్చోపెట్టారండీ. ఓ అర గంట పోయిన తరువాత ఆయనెవరో మేనేజర్ ట ఆయన గదిలోకి పంపించారు. బూట్లు చప్పుడు చేసికొంటూ ఆయన రూం లోకి వెళ్ళాను. ఈ చప్పుడు విని ఆయనకి చిరాకు వచ్చినట్లుగా అనిపించింది నాకు( మనకేంటి అనుకున్నా). టేక్ యువర్ సీట్ అన్నవెంటనే  నా చేతిలో ఒక ఫైలూ అవీ ఉన్నాయి గా

అందులోంచి నా డిగ్రీ సర్టిఫికేట్ , ప్రిన్సిపాల్ గారిచ్చిన  “  రాముడు మంచి బాలుడు” లాంటి  సర్టిఫికేట్లు ( చాలా మంది దగ్గర బలవంతం చేసి తీసికొన్నాను), స్కొట్, గేమ్స్ససర్టిఫికేట్లూ. ఆయన అదృష్టం బాగుండి కాన్వకేషన్ అయిన తరువాత విశాఖపట్నం లో తీయించుకొన్న ఫొటో ఒకటీ మర్చిపోయాను !!

                                                

    ఆయన ఇంటర్వ్యూ మొదలెట్టారండి, — ” నీ పేరేమిటి, మీ ఊరు ఇక్కడికి ఎంత దూరం, మీ అన్న దమ్ములెంత మందీ,శ్రీ శాస్త్రి గారు మీకు చుట్టమా” ఇలాంటివి అన్నీను. ఆ వాలెన్సీలు గొడవలు అన్నీ రాత్రంతా నా చేత బట్టీ పట్టించారే అవి తొందరగా అడిగేస్తే ఒక గొడవ అయిపోతుందికదా అని , లేకపోతే మళ్ళీ మర్చిపోతానేమో అని భయం. ఈ యనకేమో ఆ వ్యవహారమే పట్టదు. నా ఖంగారు నాది. ఇంతట్లో ఇంకొక చిన్న అఫీసర్ ( అడ్మిన్ ఆయన ) వచ్చి –” సార్ ఈ అబ్బాయికి ఇంకా 18 ఏళ్ళు నిండలేదూ, అప్పుడే ఉద్యోగం ఎలా ఇస్తామూ” అన్నారు( అంతా ఇంగ్లీష్ లోనే అయింది లెండి ). ఓరి నాయనో ఇదెక్కడి గొడవరా బాబూ అని నాకు టెన్షన్ వచ్చేసింది. 18 ఏళ్ళు నిండగానే వచ్చి జాయిన్ అవూ అన్నారు. ఉద్యోగం వచ్చినట్లా లేదా. అమలాపురం వెళ్ళి మా ఫ్రెండ్స్ అందరికీ ఏం చెప్పాలీ — అన్నీ వర్రీలే.

14 Responses

  1. ముందు వేలన్సీ అంటే చెప్పకపోతే మీ బ్లాగ్ తొందరలో మూసేద్దురు గాక అని నా ఉత్తుత్తి శాపం. :-))

    Like

  2. ఇంతకూ ఉద్యోగం వచ్చిందా లేదా తొందరగా చెప్పండి. టెన్షన్.. టెన్షన్!

    Like

  3. సామాన్యుడు గారూ,

    నెను రిటైర్ అయి 5 సంవత్సరాలు అవుతొంది. ఇప్పటికీ రాత్రిళ్ళు ఏదో పీడకల వచ్చి ఉలిక్కిపడి లేస్తూంటాను. ” మర్నాడు ఏదో పరీక్ష ఉంది, అది పాస్ అవకపోతే పెన్షన్ ఆపేస్తారూ”, మా ఇంటావిడ మంచినీళ్ళు తాగి పడుక్కోమంటుంది. ఏదో నా దారిన నేను రాసుకుంటూంటే మధ్యలో మీ ఫిట్టింగ్ ఏమిటండీ బాబూ!! కరుణశ్రీ గారు ” పుష్ప విలాపం” లో వ్రాసినట్లుగా ” మేం మీకేం అపకారం చేశాము ? “

    Like

  4. జిడి పప్పు గారికి,

    ఇప్పుడే మీకింత ఆత్రుత అయితే , 46 ఏళ్ళ క్రితం నా పరిస్థితి ఎలా ఉందో తెలుస్తోందా ?

    Like

  5. iMtakoo meeru A jAb lO jAyin ayyArA lEdA?

    Like

  6. ‘రక్షణ శాఖ’ అనగానే షూస్ విప్పమన్నారేమో అనుకున్నా.. అదృష్టవశాత్తూ అలాంటి ఉపద్రవం ఏదీ జరగలేదు.. చాలా చాలా చక్కగా రాస్తున్నారండి.. మీ జ్ఞాపక శక్తి మాత్రం అమోఘం.. వేలన్సీ ఎందుకు గుర్తులేదో కాని 🙂

    Like

  7. ఔవునండీ! నాకు ఇప్పటికి 10 క్లాస్ పరీక్షకి నేను లేట్ గా వెడుతున్నట్టు కల వస్తుంది! ఇవన్నీ యునివెర్సల్ ఫీలింగ్స్ ఏమోనే! అన్నట్లు లక్ష్మి ఫణి గారి బ్లాగ్ పేరు చెప్పండి!

    Like

  8. మురళి గారూ,

    ఇలాంటి పనికిరాని ఖబుర్లు అన్నీ శుభ్రంగా గుర్తు ఉంటాయి. ఏదో ” ఆయనేఉంటే మంగలాడు ఎందుకు”అని ఒక సామెత ఉంది. అలాగ నాకు అవి అన్నీ గుర్తే ఉంటే ఇలాగ ఉండేవాడినా బాబూ !!

    Like

  9. అశ్వినిశ్రీ,

    మీకు పరీక్ష కి లేట్ గా వెదుతున్నట్లు కలలు వస్తాయి. కొంచెం లేట్ గా వెళ్ళినా పాస్ అయిపోతారు. నాది అలా కాదే ” అదేదో వాలెన్సీ గురించి చెప్పలేక పోతే నా జీవనాధారం పెన్షన్ ఆపేస్తారేమోని బెంగమ్మా !!” మా ఇంటావిడ బ్లాగ్ http://bsuryalakshmi.blogspot.com/

    Like

  10. పానీపూరీ గారూ,

    ఒక్క రోజు ఆగండి బాబూ.

    Like

  11. avunu mimmalni uncle ani anocchcha.nakite alage pilavalanipistundi.uncle miru anni tv channels ki poti ayyela unnaru.mi gurinchi andariki chepte yinka andhrapradesh lo ladies andaru tv serials manesi mi story gurinche kurchuntaru.super direction……..

    Like

  12. అబ్బ, ఏమిటండీ ఈ సస్పెన్సూ? ఉద్యోగం ఏమైనట్లు?

    మీరీ టపాలు మొత్తం అయ్యాక, పుస్తకంగా వెయ్యాలని డిమాండ్ చేస్తున్నా!

    Like

  13. మధూ,

    నీకెలా కావాలంటే అలా పిలవ్వచ్చు. ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న లేడీస్ ని అందరినీ బాధ పెట్టడం ఎందుకమ్మా ? ఇంట్లో ఆవిడే వినడానికి ఈ 37 ఏళ్ళనుండీ “బోర్” కొట్టేస్తూందంటే ఇలా మిమ్మల్నందర్నీ పట్టుకొన్నాను !!

    Like

  14. సుజాత గారూ, ఏదో మీ అభిమానం కొద్దీ అలా అంటున్నారు. పుస్తకం గా వేస్తే అవి ఎవడూ చూడడు.

    Like

Leave a comment