బాతాఖాని ఖబుర్లు —5


 

      

     నాకు, మా చెల్లి పుట్టినప్పుడు, మా అమ్మ గారితో ఎడ పిల్లాడి గా స్నానం చేయించడం కూడా గుర్తుంది . ఆ తరువాత మా నాన్న గారికి రాజొలు దగ్గర మానేపల్లి

ట్రాన్స్ఫర్  అయ్యింది. ఇంకా నేను పలకా బలపాలలోనే ఉన్నాను. అక్కడ శ్రీ రాములు గారని ఒక మేస్టారు ఉండేవారు. ఆ రోజుల్లో మా నాన్నగారి స్కూల్లో ఒక బేటరీ రేడియో ఉండేది. అయినా కానీ, ఇక్కడి వాళ్ళు అందరూ, భోజనాలయ్యాక దగ్గరలో ఉన్న పెదపట్నం వెళ్ళే వారు, వాళ్ళతోపాటు నన్నూ తీసికెళ్ళేవారు. అప్పుడే నాకు

   శ్రీ పన్యాల రంగనాథరావు గారి తెలుగు న్యూస్ అంటే బోల్డు ఇష్టం ఏర్పడిపోయింది.ఆయన ఉచ్ఛారణ, చదివే విధానం ఇప్పడికీ గుర్తు !! ఆ రోజుల్లో మా పెద్దన్నయ్య గారు, శలవలికి వచ్చినప్పుడు, నాకు ఇంగ్లీష్ లో పేరు రాయడం నేర్పేరు. ఆ రోజుల్లోనే ఓ రోజు నా నెత్తి మీద ఓ రాయి పడి పెద్ద గాయం అయ్యింది.   ఆ రక్తం అదీ చూసి, మా అన్నయ్య గారికి స్పృహ తప్పిపోయిందిట !! ఆమర్నాడు రాజోలు తిసికెళ్ళి ఆమంచి శ్రీరామారావు గారి ఆసుపత్రి లో కుట్లు వేయించారు. ఆ తరువాత

మేము అందరం కలసి దొడ్డిపట్ల దగ్గర గోదావరి దాటి, నర్సాపురం లో రైలు ఎక్కి మా బాబయ్య గారి దగ్గరికి  మెడ్రాస్ తీసికెళ్ళారు. ఈ ప్రయాణం కదలికతోటి, ఆ కుట్లు కాస్తా విడిపోయి ఓ రాత్రి నిద్దర లేచేసరికి పక్క బట్టలు అంతా రక్తమయమైపోయాయి. అర్జెంట్ గా మెడ్రాస్ జనరల్ హాస్పిటల్ లో చేర్పించారు. ఓ 15 రోజులు అక్కడ ఉంచి, ఆ తరువాత ఇంటికి తీసుకొచ్చేశారు. ఆ రోజుల్లోనే ఆల్ ఇండియా రేడియో లో బాలానందం ప్రోగ్రామ్ లో ” ఉప్పు కప్పురంబు… ” పద్యం చెప్పించేరు. రేడియో అన్నయ్య, అక్కయ్య ఇప్పడికీ గుర్తు వస్తూంటారు.

           

    ఆ తరువాత, 1953 లో మా నాన్న గారికి అంబాజీపేట ట్రాన్స్ఫర్ అయ్యింది. అప్పుడే, మా వాళ్ళందరూ నన్ను  కాట్రేనికోన, మా కజిన్ సిస్టర్ గారి దగ్గర వదిలేసి, వాళ్ళందరూ బెజవాడ పెళ్ళికి వెళ్ళారు. అప్పుడే గోదావరి కి విపరీతమైన వరదలు వచ్చి ఊరూ , వాడా ఏకమైపోయింది.. మా వాళ్ళు ఏలూరు నుంచి అమలాపురం దాకా వరద లో ఓ పడవ మీద ప్రయాణం చేశారుట.

           

    1953 వ సంవత్సరం లో ఆంధ్ర రాష్ట్రావతరణ ఉత్సవాలు ఇప్పడికీ గుర్తు ఉన్నాయి! ఇంక నా స్కూల్ ప్రవాసం ప్రారంభం( పాక బడి వదలి ) అయ్యింది. ఆ రోజుల్లో నే అమలాపురం స్కూలులొ  గ్రిగ్గ్ ఆటలు నిర్వహించారు, మా నాన్న గారు బోర్డ్ హై స్కూల్ కి హెడ్మాస్టారు గా ఉన్నప్పుడు. ఎంత హడావిడో  ఆ పది రోజులూ,

ఫుట్ బాల్ ,బేస్కెట్ బాల్, కబడ్డీ, వాలీబాల్ , ఇంకా ఏవో  రన్నింగ్ ల లో మా స్కూల్  కే ఛాంపియన్ షిప్ లు వచ్చాయి. ఆ రోజుల్లో తిక్కిరెడ్డి రాముడు అనే ప్లేయర్ అన్నింటిలోనూ ఫస్టే. అతనే అందరికీ హీరో. ఇప్పుడైతే రొనాల్డో, రూనీ,లాంపార్డ్, జెర్రార్డ్ తప్ప ఇంకొకరి ఆట చూడడం నచ్చదు. ( ఇవన్నీ మా అబ్బాయి చేసిన బ్రెయిన్ వాష్ ). దానికే అలవాటు పడిపోయాను !!. వీళ్ళెవరి టీమైనా నెగ్గక పోతే ఏమిటొ బాధ పడిపోవడం ( దీని వలన మనకి ఒరిగేదేమీ లేదు ). నిన్న ఎఫ్.ఏ. కప్ లో మేంచెస్టర్ యునైటెడ్  ఓడిపోయేసరికి ఎంత బాధ అనిపించిందో. అక్కడ మా అబ్బాయి పూణే లోనూ, ఇక్కడ రాజమండ్రి లో నేనూ జాయింట్ గా బాధ పడ్డాము !!

   ఆ రోజుల్లో మా పెదనాన్న గారు వెంకటేశ్వర్లు గారికీ, మా నాన్న గారికీ, అమలాపురం హైస్కూలికి, ఎవరు  ఎన్నిరోజులు హెడ్మాస్టర్ గా ఉంటారూ అని. కోనసీమ లో  ఈ విషయమై బెట్టింగ్ కూడా జరిగేదనేవారు. ఈ గొడవలలో మా నాన్న గారికి మండ పేట ట్రాన్స్ఫర్ అయ్యింది. ఆయన ఎక్కడుంటే నా చదువూ అక్కడే ( పాస్ అయిపోవడానికి ఏమీ డౌట్ ఉండదు !! ). అక్కడ నుంచి స్కూల్ పిల్లల్ని రాజమండ్రీ ఎక్స్కర్షన్ కి తీసికొచ్చేవారు. ఆ రోజుల్లోనే వరదరావు హొటల్, సెంట్రల్ జైలూ, పేపర్ మిల్లూ చూపించేవారు. 1955 లో మా పెద్దన్నయ్య గారి వివాహం ఆలమూరు దగ్గర జొన్నాడ లో జరిగింది. ఆలమూరు బ్రిడ్జ్ అప్పుడు కడుతూ ఉండేవారు.

         

    1956 వ సంవత్సరం అనుకొంటా గోదావరి పుష్కరాలు ఇప్పడికీ గుర్తు  ఉన్నాయి. కోటిలింగాల రేవు లో స్నానాలు, ఓ పెద్ద ఎగ్జిబిషనూ, అందులో నాకు గుర్తు ఉన్నంతవరకూ, టెలివిజన్ కూడా చూపించేరని. అందులో రోజులు మారాయి సినిమాలో ” ఏరువాకా సాగారో.. ” డాన్స్ చూసినట్లు గుర్తు .

         ఆ రోజుల్లో అమలా పురం లో ఆంధ్రా గవర్నర్ శ్రీ త్రివేది, మెహర్ బాబా, ఆఛార్య వినోబా భావే గారిని,శృంగేరీ శంకరాచార్య గారినీ చూశే అదృష్టం కలిగింది. మా నాన్న గారికి ఆ నాటి కోనసీమ  ప్రియతమ నాయకుడు శ్రీ కళా వెంకట్రావు గారంటే విపరీతమైన భక్తి.  ఎంత అభిమానం అంటే, ఆయన ఎప్పుడైనా అమలా పురం వచ్చి వెళ్ళే రోజున మా ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేయించి, ప్రసాదం ఇవ్వడానికి నన్ను పంపేవారు. ఆ సందర్భం లో అలాంటి మహనీయుడి ని కలిసే భాగ్యం కలిగింది.

       

     ఒక సారి ” సువర్ణసుందరి ” శత దినోత్సవాలు జరిగేయి అమలాపురం లో. అప్పుడు నాగేశ్వర్రావు, అంజలీ, వేదాంతం, రేలంగీ మొదలైన వారు వచ్చేరు.మేము స్కూల్లో స్కౌట్ ల లో ఉండడం చేత వీళ్ళందరినీ  దగ్గరగా చూసే భాగ్యం కలిగింది !! ఆ రోజుల్లో  ఇలాంటి వాటికి చాలా ప్రాముఖ్యం ఉండేది.. ఇవే కాకుండా స్కూల్లో ఎవరైనా ఇన్స్పెక్షన్ కి వచ్చేరంటే  వాళ్ళకి భోజనం అవీ మా ఇంటి నుంచే వెళ్ళేవి. ఇంట్లో ఏమీ వంట మనిషీ ఎవరూ ఉండే వారు కాదు. మా అమ్మ గారే ఆ పొయ్యి ల మీద చేయడం. ఇంట్లో అస్తమానూ ఎవరో ఒకరు ఉండేవారు. కోనసీమ అంతటికీ అమలాపురం లోనే కాలేజీ ఉండెది. మా ఇల్లు అక్కడికి చాలా దగ్గరగా ఉండేది. మా చుట్టాలలో ఎవరైనా కాలేజీ చదువులు మా ఇంట్లోనే ఉండి చదువుకొనేవారు.  ఎంతమంది భోజనానికి ఉండెవారో, అంతా మా అమ్మగారే ఒంటి చేత్తో చేశేవారు.

బహుశా ఆరోజుల్లో ఆవిడ చేసిన పుణ్యం వలనే మేము ఈ రోజున ఆనందంగా ఉంటున్నాము.

Advertisements

6 Responses

 1. మీ జ్ఞాపకాల దొంతరల తెరలు తొలగించి, మీ అనిభవాలని మా తరానికి పంచుతున్నందుకు, చాలా కృతజ్ఞులం. రాస్తూ ఉంటారని ఆశిస్తూ.

  Like

 2. కొందరన్నట్లు మీరు కోనసీమ కబుర్లు వ్రాయాలి! చాలా కాలం క్రితం నేను అమలాపురం వచ్చాను. అక్కడ భూపయ్య అగ్రహారంలో మా బాబాయి (విజయ బాంకు మురమళ్లలో పని చేసే వారు) ఉండే వారు. నేను అక్కడ నుంచి కోటిపల్లి, ముక్తేశ్వరం, ద్రాక్షారామం, అలాగే అప్పనపల్లి ఇవన్నీ చూడటం జరిగింది…
  కబుర్లు చెప్పుకోవటం ఒకప్పుడు. ఇలా బ్లాగులో కబుర్లను చూడటం ఇప్పటి పధ్ధతి. కానీయండి. ఇదీ బాగానే ఉంది.
  ~~~శ్రీపతి

  Like

 3. బావున్నాయి. ఈ సారి కబుర్లలో అప్పటి పత్రికలూ, పుస్తకాలు…… ఆ తరువాత ఏమన్నా ఉంటె గింటే మీ ప్రేమ పులకరింపులు…

  Like

 4. అసంఖ్యగారూ, ఏదో ఓపిక ఉన్నంత వరకూ, మీరందరూ మానేయమనేవరకూ, రాద్దామనే సంకల్పం.

  Like

 5. శ్రీకరం గారూ, ధన్యవాదములు.నేను కోనసీమ లో ఉన్నది 18 సంవత్సరాలు. అందులో మొదటి 5 సంవత్సరాలూ ఏమీ తెలియదు. ఆ తరువాత 13 ఏళ్ళూ, చదువుల టెన్షన్ తో రోజులు వెళ్ళి పోయాయి ( పోనీ అదైనా వచ్చిందా). ఆ చిన్ననాటి ఖబుర్లు గుర్తు చేసికొందామనే ఇప్పుడు మళ్ళీ రాజమండ్రీ వచ్చాను. ఈ గోదావరి గాలి తగిలేడప్పడికి, ఈ ఖబుర్లు వచ్చేశాయి !!

  Like

 6. కృష్ణారావు గారూ, మీ వ్యవహారం చూస్తూంటే నా కొంప ముంచేలాగ ఉన్నారు. ఏదో ఇలా వెళ్ళిపోనీయండి బాబూ.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: