ఉద్యోగం లో ఉండేటప్పుడే బావుండేదనిపిస్తూంటుంది. ఏదో వేళకి నిద్రలేవడం,ప్రొద్దుటే డ్యూటీ కి వెళ్ళి,అక్కడే భోజనం గట్రా ( మా ఇంటావిడిచ్చిందే !) పూర్తిచేయడం, సాయంత్రం ఏ ఏడింటికో కొంప చేరడం.ఓ రెగ్యులారిటీ ఉండేది. రిటైరయిన తరువాత, చెప్పేనుగా ప్రతీవారూ అనుకుంటారూ, వీళ్ళకేమీ పనీ పాటా లేదు. అయినా ఎప్పుడు పలకరించినా, ఏదో దేశాన్ని ఉధ్ధరించినట్లుగా, మాట్లాడతారూ, ” లేదండీ, ఇవేళ అసలు టైము లేదూ, మా అగస్థ్యకి క్రెచ్ శలవూ,కోడలొక్కర్తే ఉంటుందీ” అనో, ” మా అల్లుడు బయటకెళ్ళాడూ, అమ్మాయీ పిల్లలతో కొంతసేపు గడపాలీ” అనో, ఏవేవో వంకలు పెట్టేస్తామని మా స్నేహితుల అపోహ! కానీ నిజం అదే !
ప్రతీ శనాదివారాలూ, మా ఇంటికి వెళ్తూంటాము. మొన్న శనివారం నాడు జరిగిన కార్యక్రమం గురించి, ప్రత్యేకంగా ఓ టపా వ్రాస్తాను. అక్కడినుండి, రాత్రి వచ్చేటప్పటికే చాలా టైమైపోవడం వలన, మా ఇంట్లోనే ఉండిపోయాము. ఆదివారం కదా అని, అబ్బాయి ఎక్కడో ముల్షీ డాం కి వెళ్దామన్నాడు. ఇలాటివన్నీ మా ఇంటావిడకి భలే ఇష్టం! నాతో ఎలాగూ కుదరదూ, పిల్లలతో ఇలాటి కోరికలు తీర్చుకుంటూంటుంది. నాకు చెప్పానుగా, అంత ఈస్థటిక్ సెన్స్ లేదు. ఏదో ప్రకృతీ, సౌందర్యమూ,వగైరా వగైరా లన్నీ.నా కంఫర్ట్ లెవెల్ వేరూ. మీదారిన మీరు వెళ్ళండీ, నేను హాయిగా ఇంట్లో ఉంటానూ అని చెప్పేశాను.ఏం లేదూ, సాయంత్రం వంటావిడొచ్చినప్పుడు, చెప్పడానికి ఎవరో ఒకరు ఇంట్లో ఉండొద్దూ? బయటకెళ్ళాడం కంటే, ఈ డ్యూటీ హాయనిపించింది.
రాత్రి భోజనం చేసేసిన తరువాత, అబ్బాయి మేముండే ఫ్లాట్ లో దింపేసి వెళ్ళిపోయాడు.మా ఇంట్లోనే ఉండేమాటైతే, ప్రొద్దుటే లేవాల్సివస్తుంది! మరీ నవ్య స్కూలుకి వెళ్ళేటైముదాకా లేవకపోతే బావుండదు కదా అసలు అదీ కారణం, రాత్రి ఎంతాలశ్యమైనా వచ్చేయడానికి. మరీ ఈ విషయం పిల్లలతో అంటే బావుండదుగా! ఈ వేళ ప్రొద్దుటే, అమ్మాయి ఫోనూ! ” నేనూ ఇక్కడే ఉంటున్నానూ అని ఏమైనా గుర్తుందా అసలు మీకు,అప్పుడప్పుడు నన్నూ, పిల్లల్నీ కూడా పలకరించొచ్చు” అని కోప్పడేసింది! నిజానికి, మా కోడలు ఆఫీసుకెళ్ళవల్సిన అవసరం ఉండడంతో, నేను, మా నవ్య స్కూలునుంచి రాగానే, వాళ్ళ అమ్మా నాన్న వచ్చేదాకా కంపెనీ ఇమ్మని, నిన్ననే చెప్పారు పిల్లలు. ఈ విషయం, అమ్మాయితో చెప్తే, అయితే అమ్మను పంపెయ్ ఇక్కడకు, అంది.ఇంతలో తనే చెప్పింది, నేనే వచ్చి పిక్ అప్ చేసికుంటానూ అని. నన్ను మా ఇంటిదగ్గర దింపెసి, వాళ్ళమ్మను తీసికుని వెళ్ళింది.
మా ఇంటావిడ దగ్గర ఓ సెల్ ఫోనుంది. అప్పుడెప్పుడో ఓ టపా కూడా వ్రాసింది.అప్పుడేమో అగస్థ్య ధర్మమా అని, సైలెంటయిపోయింది, ఏదో మళ్ళీ పని చేయడం మొదలెట్టింది కదా అని కొత్త ఫోను కొనే ప్రయత్నం వాయిదా వేశాను. నిన్న నవ్య ధర్మమా అని, మళ్ళీ సైలెంటయిపోయింది! అందుకే ప్రొద్దుట అమ్మాయి ఎన్నిసార్లు ఫోను చేసినా, వినిపిస్తే కదా,నాకు ఫోను చేసి, అమ్మ ఇంట్లో లేదా, ఫోనెత్తడం లేదూ అని అడిగింది.శుభ్రంగా ఉందీ అని నిన్నటి భాగవతం అంతా చెప్పాను. ప్రస్తుతానికి “అలంకారార్ధం గంధం సమర్పయామీ” లాగనే ఆవిడ సెల్ ఫోనూ!ఈసారి మార్చకపోతే, వీధిన పడిపోతాను!
ఛాన్స్ దొరికినప్పుడల్లా మేముండే ఇంటికి రావడానికి ఇంకో కారణమేమిటీ అంటే, ఇంటావిడ చేసే వంట.అబ్బాయి వాళ్ళింట్లో వంటావిడ చేస్తుంది. ఏదో వారానికి ఒక్కరోజైతే ఫరవా లేదు కానీ ప్రతీ రోజూ తినడం నా వల్ల కాదుబాబూ!ఈవేళ, మెంతికూర పప్పూ, మజ్జిగ పులుసూ, తోటకూర పులుసూ చేసింది. ఏక్ దం బ్రహ్మాండం.అక్కడ ఆ వంటావిడా చేస్తూంటుంది, “ఖడీ” అని, మరాఠీ మజ్జిగ పులుసు లాటిది. కానీ దేని దారి దానిదే.మజ్జిగ పులుసు రుచే వేరు!
సాయంత్రం మాకోడలూ, అగస్థ్యా వచ్చిన తరువాత, అమ్మాయి దగ్గరకు బయలుదేరాను, మా ఇంటావిడను తెచ్చుకోవద్దూ? ఇంతలో ఓ ఫ్రెండు, మా అమ్మాయీ వాళ్ళింటికి దగ్గరలోనే ఉంటున్నాడు, కారులో లిఫ్ట్ ఇచ్చాడు. అమ్మాయి చేతి వంట తినెసిన తరువాత, ఇదిగో ఇప్పుడే దింపేసి తిరిగి వెళ్ళింది. మొత్తానికి ఈ రోజంతా వాహనయోగమే !
మరి ఈ కార్యక్రమాలన్నీ ఊళ్ళో వాళ్ళందరికీ ఎలా టముకేసికోగలనూ? చెప్తే నమ్మరూ, ఏదో పోజెడుతున్నామంటారు.
Filed under: Uncategorized