ఈవేళ ప్రొద్దుట హారం లో నవతరంగం లో ‘బాపు ఇక వంటరి వారు…’ అనే శీర్షిక చూసి, ఏమిటీ బాపూ రమణల జంట విడిపోయి, వారు తీసే కొత్త సినిమాకి రచయితని మార్చారా ఏమిటీ అనే అనుకున్నాము కానీ, తెలుగువారి అభిమాన రచయిత శ్రీ ముళ్ళపూడి వారు ఇకలేరని, అసలు తల్చుకోడానికే అవలేదు.అప్పటికే, శ్రీ ఎం.వి.అప్పారావుగారి దగ్గరనుండి నా సెల్లులో ఓ మిస్స్డ్ కాల్ ఉంది. ఆయనకు తిరిగి ఫోను చేసి మాట్లాడదామంటే అసలు మాటలే రాలేదు.గొంతుక పూడుకుపోయింది.ఎవరో మన ఆత్మ బంధువే ఆ భగవంతుడి దగ్గరకు వెళ్ళిపోయారా అన్నంతగా ఏడుపొచ్చేసింది.
ప్రొద్దుటినుండీ వివిధ చానెల్స్ లోనూ ప్రసారం చేస్తున్న శ్రధ్ధాంజలి కార్యక్రమాలూ, బ్లాగుల్లో వ్రాస్తున్న టపాలూ చూసిన తరువాత, ఇదిగో ఇప్పటికి తేరుకుని వ్రాయడం మొదలెట్టాను. కీ బోర్డ్ మీద వేళ్ళు నడవ్వే.ఎలా వ్రాయాలో, ఎక్కడ మొదలెట్టాలో కూడా తెలియని అయోమయ పరిస్థితి.అసలు వ్రాయకపోతే ఏమౌతుందీ? నేను వ్రాయకపోతే, ఆయనమీద ఉన్న నాకున్న భక్తి, ఆరాధన,ఎవరికి ఎలా చెప్పుకోనూ? స్వయంగా అనుభవించిన ఆనందం, అదీ ఇంకా ఆరు నెలలేనా అవలేదు.ఇంతలోనే ఏం తొందరొచ్చేసిందీ ఆయనకి? అక్కడేం రాచకార్యాలు వెలగబెట్టాలిటా?అక్కడే చిర్రెత్తుకొస్తుంది ఇలాటి వారితో, గత నలభై ఏళ్ళనుండి ప్రయత్నిస్తున్నా వీలు పడని ఆ అవకాశం, నాకోసమే అన్నట్లుగా రావడం ఏమిటీ, నేనూ మా ఇంటావిడా చెన్నై వెళ్ళడమేమిటీ, అక్కడ ఆయనతో ఫోనులో దెబ్బలాడేసి, ఆయన్ని కలిసి ఒకటా రెండా, మూడున్నర గంటలు ఆయన సముఖంలో కూర్చోడమేమిటీ, ఏమిటో అంతా కలగానే మిగిలిపోయింది.
అదంతా కల కాదూ నిజం గానే జరిగిందీ అనడానికి, ఆయన మా టెండర్ లీవ్స్ కి ఇచ్చిన పాతిక పుస్తకాలూ పక్కనే ఉన్నాయే, పోనీ ఆ సంగతి వదిలేయండి, మా టెండర్ లీవ్స్ కి ఒక సందేశం పంపించగలరా అని, చేత్తో వ్రాయలేక( ఎందుకంటే వ్రాసేటప్పుడు నా చేతులు వణుకుతాయి!), కంప్యూటరు లో వ్రాసే ధైర్యం చేసి, ఆ తప్పిదానికి కారణాలు వివరిస్తూ క్షమాపణ చెప్పుకుంటూ, ఓ ఉత్తరం మళ్ళీ దానికీ ప్రింటౌట్టోటీ,ఎందుకంటే, ఆయనకి ఇ కంప్యూటరు తో పరిచయం లేదని, ముందుగానే చెప్పారు.ఇన్ని హడావిళ్ళు చేసి నేను పోస్ట్ చేసిన పది రోజుల్లో, ఓ ఇన్లాండ్ ఉత్తరం మీద స్వయంగా వ్రాసి నా ఎడ్రెస్ కూడా స్వయంగానే వ్రాయగా, నాకొచ్చిన అమూల్య కానుక ఎప్పుడూ కనిపిస్తూనే ఉంది.
పోనీ ఈ విషయం పక్కకి పెడదాము.క్రిందటి నెల 26 న అప్పారావుగారి బ్లాగులో శ్రీ ముళ్ళపూడి వారి వివాహ వార్షికోత్సవమూ అని చదివి, అక్కడికి ఆయనేదో మన దగ్గర బంధువులా, మేము శుభాకాంక్షలు చెబ్దామనుకుని ఫొను చేయగానే, ముందుగా శ్రీదేవి గారూ, శ్రీ రమణగారూ, ఇలా నేనూ పూణె నుంచి ఫణిబాబూ అనగానే ‘ హల్లో మీ అబ్బాయి లైబ్రరీ ఎలా ఉందీ’ అని వాళ్ళిద్దరూ అడగడమెమిటండి బాబోయ్! అసలు ఆ దంపతుల గురించి ఏమనుకోవాలో తెలియడం లేదు. అసలు చుట్టాలే మొహం చాటేస్తున్న ఈ రోజుల్లో ఏ బంధుత్వమూ లేని, మాలాటి అర్భకుల మీద అసలు అంత అభిమానం ఎందుకండి బాబూ?
పోనీ ఈ అభిమానమైనా నాలుగు కాలాల పాటు ఆస్వాసిద్దామా అనుకుంటే, ఎవరికీ చెప్పా పెట్టకుండా వెళ్ళిపోవడం.అసలు ఆ భగవంతుణ్ణనాలి,శ్రీ ముళ్ళపూడి వంటి వారిని పుట్టించడం ఎందుకూ, పోనీ పుట్టించాడే,ఆ కోతికొమ్మచ్చి మూడో భాగం కూడా వ్రాయనీయొచ్చుకదా. అప్పుడు కలిసినప్పుడు అడిగితే, ఇంకా తొంభై పేజీలు తక్కువయిందీ, ఎప్పుడో తీరిక చేసికుని వ్రాస్తానూ అన్నారు. ఇంకెక్కడి తీరిక?మా స్నేహితులడిగారు ఆయనతో మూడున్నర గంటలు ఏం మాట్లాడారూ అని.కావలిసినన్ని( జీవితం అంతా గుర్తుంచుకోకలిగినన్నీ) కబుర్లు చెప్పుకున్నాం. అన్నీ అందరికీ చెప్పాలా ఏమిటీ? మా పిల్లలూ అడిగారు, మీరింతసేపు అక్కడేం చేశారూ అని,నేను మాట్లాడినదెంతా, ఆయన మొహంలోకి చూడ్డంతోనే సరిపోయింది.
నేను కూడా కంప్యూటరులో తెలుగులో వ్రాయగలనూ అనే ఆత్మ విశ్వాసం, మొట్టమొదటి సారి, రాజమండ్రీ కాపరం లో ‘ స్వాతి’ వార పత్రికలో ‘కోతొకొమ్మచ్చి’ మీద నేను వ్రాయగా ప్రచురించబడ్డ ఉత్తరం ద్వారానే కదా!అప్పుడు నాకు తోచినదేదో వ్రాసేశాను, ఇప్పుడు ఆలోచిస్తే అనిపిస్తోంది, అంత ధైర్యం అసలు ఎలా చేయగలిగానా అని.
చెన్నైలో శ్రీ ముళ్ళపూడి వెంకట రమణ గారితో నేనూ, మా ఇంటావిడా అనుభవించిన అలౌకికానందం గురించి ఇక్కడ చదవండి.
అసలు ఆ భగవంతుడేమిటో, మనతో ఎందుకు ఆడుకుంటాడో ఎవరికీ అర్ధం అవదు. రేపు ఆ ‘బుడుగు’ వచ్చి మా నాన్నెక్కడా అంటే ఏం చెప్తాం?
Filed under: Uncategorized


ఉదయాన్నే బెంగులూరినుంచి విజయవర్ధన్ గారు నాకు పంపిన మైలు
చూడగానే భోరున ఏడ్చాను. అటుతరువాత వస్తున్న ఫోన్లకు జవాబు
ఆగని నా ఏడుపే సమాధానం. ఒక మితృడు కంగారుగా ఇంటికి వచ్చి
ఓదార్చాడు. ఏమిటొ తెలియని అనుబంధమ్ రమణ గారితో బాపు గారితో
అలా దేముడే కూర్చాడు. మళ్ళీ ఆ రాముడే ఒక్కసారి విడదీశాడు. నేను
పంపిన శుభాకాంక్షలు అందుకొని, “మీకు నామీద ఎంత ప్రేమండీ” అంటూ
ఆయన చేసిన ఆనాటి ఫోను ఇలా ఆఖరి ఫోనవుతుందనుకోలేదు.
[...] the library as their contribution to Tender Leaves. My father, who is a popular Telugu blogger, has blogged about Sri Mullapudi Venkataramana. (Written in [...]
జాతస్యహి ధృవోమృత్యుః
వారితో పరిచయం కలగటం మీ అదృష్టం
రమణికి తెలుగు బ్లాగుల్లో జాల పత్రికల్లో వచ్చిన అశృనివాళులు ఇక్కడ పెట్టాను చూడండి.
http://vareesh.blogspot.com/2011/02/blog-post_7390.html
ఆఫీసునుండి ఇంటికి రాగానే మా ఆవిడ ముళ్ళపూడి వెంకటరమణగారు పోయారటండీ అంటే ఏడుపొచ్చేసినంత పనయింది. న్యూస్ ఛానళ్లు అన్నీ గబ గబా తిరగేశాను. కాని ఎక్కడా ఆవిషయం గుఱించి లేకపోయేసరికి మా ఆవిడ ఏదో పరాకుగా చెప్పిందేమో అని అనుకుంటూ కంప్యూటరు ముందు కూర్చుని ఓపెన్ చేయగానే మీ బ్లాగులో వార్త కనిపించి చాలా బాధ వేసింది. అవును. మన బుడుగు కనిపించి మా నాన్నేడీ అంటే ఏం సమాధానం చెప్తాం మనం?
ఇన్నాళ్లుగ నీ రాతల్లో నువ్వొదిలిన
ఫన్నీలన్నీ ఇపుడు నువ్వు లేవంటూంటే
కన్నీళ్లు ఒక్కుదుటన ధారలవుతున్నాయి
విన్నావా ముళ్ళపూడి వెంకట రమణా
అటు చూడు
“హన్నా” అంటూ బెదిరించే బుడుగు బేలగా ఏడుస్తున్నాడు
“ప్రైవేట్” చెప్పేందుకు ఎవరూ లేక బాబాయ్ భోరుమంటున్నాడు
“సెగట్రీ” నీ ఆర్డర్ల కోసం ఆశగా ఎదురుచూస్తున్నాడు
“అరుణ” ‘అప్పు’డే ఋణం తీర్చుకోద్దంటోంది
“రాధా గోపాళం” రావా రమణా అని పిలుస్తున్నారు
సర్లే ఇవన్నీ వదిలేయి. అటు చూడు బాపు కళ్ళలో …తన మనసు నీకు తెలీదని కాదు కానీ నువ్వు లేని బాపు ని చూస్తే ఆత్మ లేని శరీరాన్ని చూసినట్టు లేదూ? అయినా
నీ ఆత్మ బాపులో
బాపు ఆత్మ నీలో ఉన్నప్పుడు
తన అనుమతి లేకుండా
పరమాత్మను చేరే హక్కు నీ కెక్కడ రమణా?
బాబుగారూ!
ప్రొద్దున్న 8-00 కి తీరిగ్గా నిద్రలేచి, (రాత్రి 12-00 వరకూ టీవీ వార్తలు చూస్తూనే వున్నానే!) టీవీ పెట్టి షాక్ అయ్యాను.
ఓ టపా వ్రాద్దామనుకొని, అంత సాహసం చెయ్యలేకపోయాను!
నాకు కేవలం వారు ముఖ పరిచయమే (కొన్ని వేల మంది మధ్య!). మరి మిమ్మల్ని వోదార్చడానికి నాకు మాటలెలా వస్తాయి–మీ సన్నిహిత పరిచయం చదివాక?
అయినా ఇలాంటి సమయంలోనే “గుండె రాయి చేసుకోవాలి” (ఇదేదో రొటీన్ డైలాగు అనుకోకండి).
మన “రమణ” చిరంజీవే కదా!!!
@గురువుగారూ,
అసలు మన జీవితంలో శ్రీ ముళ్ళపూడి వెంకట రమణ గారిలాటి వారిని చూడగలమా?
@వజ్రం,
అదే నేను చేసికున్న అదృష్టం !
@సిరిసిరి మువ్వ,
శ్రధ్ధాంజలులన్నీ ఒకచోట చేర్చి మీరు చాలా మంచిపని చేశారు.
@నరసింహరావు గారూ,
బుడుగే కాదు, తెలుగు పాఠకులందరూ నాన్న లేని వారైపోయారు.
@శంకర్,
“కన్నీళ్లు ఒక్కుదుటన ధారలవుతున్నాయి
విన్నావా ముళ్ళపూడి వెంకట రమణా”– నిజమే.
@కృష్ణశ్రీ గారు,
అదేమిటోనండి. పరిచయం అయింది ఆరు నెలలే అయినా,ఆయనతో గడిపిన ఆ మూడు నాలుగు గంటలూ చాలు నా మిగిలిన జీవితమంతా జ్ఞాపకం చేసికోడానికి.
మీరు ధన్యులండి. అంత కంటే ఏమి చెప్పలేకపోతున్నాను.
అనుపమా,
అది నేను చేసికున్న అదృష్టం.